తను శ్రీ దత్తా టాపిక్ ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా తనను నానా పటేకర్ పదేళ్ల క్రితం వేధించారని తనకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. అన్నేళ్ల క్రిందట సంగతి ఇప్పుడు ఎందుకు అని కొందరు సైలెంట్ గా ఉంటే…మరికొందరు ఆమెకు మద్దతు ఇస్తూ నానా పటేకర్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే కేవలం కొందరు మాత్రమే తన గురించి మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన చెందుతోంది.
ముఖ్యంగా అమితాబ్ ని రీసెంట్ గా ఈమె విషయం అడిగారు. దానికాయన..ఎటూ చెప్పలేక అన్నట్లుగా…‘నా పేరు తనుశ్రీ కాదు. నేను నానా పటేకర్‌నూ కాదు. అలాంటప్పుడు నేనెలా స్పందిస్తాను?’ అని తప్పుకున్నారు. ఇలా అమితాబ్ అనటం తనుశ్రీకు మరింత మండుకొచ్చింది. దాంతో ఆమె వాడి వేడిగా స్పందించింది.
తనుశ్రీ మాట్లాడుతూ ‘అమితాబ్ బచ్చన్ నా ఇష్యూ గురించి అన్న మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. ఆడపిల్ల పట్ల జరిగిన అన్యాయం గురించి స్పందించని ఇలాంటి వాళ్లా సోషల్ ఇష్యూల నేపథ్యంలో సినిమాలు చేసేది? సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషిస్తారు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతారు. కానీ కళ్లెదుట జరుగుతున్న దారుణాల గురించి మాత్రం స్పందించరు.
ఇక నేను బాలీవుడ్‌లోకి మళ్లీ తిరిగి రాను. నాకు అమెరికా పౌరసత్వం ఉంది. అక్కడికే వెళ్లిపోతాను. బాలీవుడ్‌లో ఇంత అవమానాన్ని ఎదుర్కొన్న నేను ఎంతో నలిగిపోయాను. దాదాపు 30, 40 సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నాను. ప్రముఖులు నాకు ఫోన్లు చేస్తూ మద్దతు తెలుపుతున్నారు. కానీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఖండన లేదు.’ అని బాధతో చెప్పుకొచ్చింది తనుశ్రీ.