టీ-హాలీడేస్..సైరా దూకుడు!

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. అప్ప‌టికే తెలుగు రాష్ర్టాల్లో ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో సైరాకి ఆ వారం రోజులుగా బాగా క‌లిసొచ్చాయి. మెగాస్టార్ సినిమా కావ‌డం…స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ కావ‌డం…సైరాకి పోటీగా మ‌రో సినిమా లేక‌పోవడంతో స్టిల్ సైరా దూకుడు కొన‌సాగుతోంది. ఓవ‌ర్సీస్ లో కాస్త ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేన‌ప్ప‌టికి సైరాకి తెలుగు రాష్ర్టాల వ‌సూళ్లే కీల‌కంగా మారాయి. ఇదే సమ‌యంలో తెలంగాణ ఆర్టీసీ స‌మ్మెకు దిగ‌డంతో ఎక్క‌డి బ‌స్సులు అక్క‌డే నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ద‌స‌రా సెల‌వుల‌ను ఉన్న‌చోట‌నే సెల‌బ్రేట్ చేసుకోవాల్సి వ‌చ్చింది. తాజాగా మ‌రోసారి స‌మ్మె నేప‌థ్యంలో ద‌స‌రా సెల‌వుల‌ను మ‌రో వారం రోజుల పాటు పొడిగించిన‌ట్లు కేసీఆర్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ వారం రోజులు కూడా స్కూళ్లు, కాలీజీలు అన్నీ బంద్. దీంతో ఈ వారం రోజులు తెలంగాణ రాష్ర్టంలో సైరాకు క‌లిసొచ్చే అంశ‌మే. ఇప్ప‌టివ‌ర‌కూ స‌మ‌యం లేక సైరా చూడ‌ని విద్యార్థులంతా సినిమా టిక్కెట్ల‌ను బుక్ చేసుకుంటున్నారు. దాదాపు హైద‌రాబాద్ సిటీలో ఏ థియేట‌ర్ చూసినా విద్యార్థుల‌తోనే నిండిపోతుంది. ప్ర‌తి ప‌క్షాలు ప్ర‌భుత్వంపై దుమ్మెత్తి పోయ‌డంతోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

అవి ద‌స‌రా హాలీడేస్ కాదు…కేసీఆర్ హాలీడేస్ అంటూ ముఖ్య‌మంత్రి ప‌నితీరుపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అటు స్కూళ్ల యాజ‌మాన్యాలు వారం రోజులు పాటు ఇష్టానుసారం సెల‌వులు ప్ర‌క‌టిచ‌డంతో….సిల‌బ‌స్ ఎప్పుడు పూర్తిచేయాలంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉద్యమం మ‌రింత తీవ్ర రూపం దాల్చ‌డంతో సెల‌వులు ఇంకెన్ని రోజులు కొన‌సాగుతాయో అర్ధం కాని సన్నివేశం ఎదుర‌వుతోంది. ఏదేమైనా హాలీడేస్ మాత్రం సైరాకి బాగా క‌లిసొస్తున్నాయ‌న్న మాట మాత్రం వాస్త‌వం.