సుశాంత్ మేనేజ‌ర్ దిషా తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

                                      పోలీసులు కాదు మీడియానే వేధిస్తోంద‌ట‌!

దివంగత సెలబ్రిటీ మేనేజర్ దిషా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ తన కుటుంబంపై మీడియా వేధింపులు, దారుణాలపై తీవ్రంగా ఆరోపిస్తూ బుధవారం ముంబై పోలీసులకు లేఖ రాశారు. దిషా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. తన కుమార్తె ఫలానా రాజకీయ నాయకుడితో సంబంధం కలిగి ఉంద‌న్న‌ వార్తలు లేదా అత్యాచారం.. హత్య వార్త‌లు నిజం కాదు. నాయ‌కులు ఇచ్చే పార్టీలకు హాజరవుతున్నారనే వార్తలు నిజాలు కావ‌ని వాపోయారు. ఇవ‌న్నీ మీడియా వండిన క‌ట్టుక‌థ‌లు అని ఆ లేఖ‌లో ఆరోపించారు. స‌ద‌రు అస‌త్య ప్ర‌చారానికి పాల్ప‌డే మీడియాల‌పై సహేతుకమైన చర్య తీసుకోవాలని ఆయ‌న కోరారు.

మానసిక వేధింపులు పర్యవసానంగా నా కుటుంబీకులు.. మరణించిన నా కుమార్తె దిశా సాలియన్‌ను జర్నలిస్టులు మీడియా ప్ర‌ముఖులు వేధింపులకు గురిచేస్తున్నారని దిషా తండ్రి ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. పోలీసుల‌కు రాసిన లేఖ‌లో ఎవ‌రెవ‌రు ఆ మీడియా ప్ర‌ముఖులు అన్న‌ది కూడా ఆయ‌న జాబితాను అందించారు.

నా కుమార్తె మరణానికి సంబంధించి ఇంటర్వ్యూల పేరిట మీడియా నిజాల్ని దాచిపెట్టింది. డిబేట్లు చేప‌ట్టిన‌వాళ్లు తప్పుదోవ పట్టించే వార్తలను అందిస్తున్నారు. ఇది వాస్తవ విచారణకు అడ్డంకిని సృష్టించడమే కాదు.. నా కుటుంబానికి నష్టం క‌లిగిస్తోంద‌ని ఆరోపించారు. ఫౌల్ ప్లేలో ఎవరినీ అనుమానించవద్దని మేము ఇప్పటికే పోలీసులకు మా ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చాం. మా న‌మ్మ‌కాల్ని వ‌మ్ము చేయ‌వ‌ద్ద‌ని పోలీసుల‌ను కోరుతున్నామ‌ని క‌ల‌త చెందారు.

“రాజకీయ నాయకుడితో దిషా ప్రమేయం అనే వార్త‌లు ఛానెళ్లకు అమ్మేందుకు వండిన కథలు మాత్ర‌మే. ఈ కథలు నిజం కాదు. ఇవి ప్రజలను తప్పుదారి పట్టించాయి. మ‌మ్మ‌ల్ని దెబ్బతీస్తున్నాయి. నా కుమార్తె  కీర్తి  నా కుటుంబం ఖ్యాతిని మంట‌క‌లిపాయి. ఈ నకిలీ వార్తలు నా కుటుంబ స‌భ్యుల మ‌నోధైర్యాన్ని.. ఆరోగ్యాన్ని భాగా దెబ్బతీస్తున్నాయి. మేం మీడియా వ‌ల్ల‌నే బాధితులవుతున్నాం. ముంబై పోలీసులు నిర్వహిస్తున్న దర్యాప్తుపై మేము పూర్తిగా సంతృప్తి చెందాం. వారిపై నమ్మకం ఉంది“ అని ఆ లేఖ‌లో దిషా తండ్రి తెలిపారు. జర్నలిస్టులు, ప్రభావశీలులు, రాజకీయ నాయకులు త‌ప్పు దారి ప‌ట్టించార‌ని ఆయ‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఇద్దరూ హత్యకు గురయ్యారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బిజెపి రాజ్యసభ సభ్యుడు నారాయణ్ రాణే ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ముంబై పోలీసులు దిశా గురించి మరింత సమాచారం కోసం వెతికే ప‌నిలో ప‌డ్డారు. కుటుంబీకుల్ని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. దివంగత సెలబ్రిటీ మేనేజర్‌పై మరింత సమాచారం, ఆధారాలు కోరుతూ మలాడ్‌లోని మాల్వాని పోలీస్ స్టేషన్ బుధవారం ఒక పత్రికా ప్ర‌క‌ట‌న‌ జారీ చేసింది.  ఆ క్ర‌మంలోనే దిశా తండ్రి లేఖ ఇప్పుడు కొత్త కోణాల్ని బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తోంది. ఇంత‌కీ దిషా తండ్రి ఇక చాలించాల‌ని కోరుకుంటున్నారా?  నిజాలు బ‌య‌టికి రావాల‌ని కోరుకుంటున్నారా? అస‌లు ఈ కేసులో త‌ప్పిదం ఎవ‌రిది? అన్న‌ది తేలాల్సి ఉంది.