సమగ్ర విచారణ డిమాండ్ చేసిన బావ
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పరిశ్రమ వ్యక్తులనే కాదు.. సామాన్య ప్రజలను బాధించింది. అతని మరణం వెనక బాలీవుడ్ లో రకరకాల కోణాల్ని బహిర్గతం చేస్తోంది. సినీ పరిశ్రమలో పవర్ ఫుల్ శక్తులు సుశాంత్ వంటి బయటి వ్యక్తులపై ఎంత ఎగతాళిగా ఉంటారో… కొంతమంది జర్నలిస్టులు ట్విట్టర్ ద్వారా చేస్తున్న పోస్టులు వెల్లడిస్తున్నాయి. నటవారసులు.. కొన్ని శక్తుల గుప్పిట్లో ఉండే పరిశ్రమ ఇతరుల్ని ఎంతగా అవాయిడ్ చేస్తాయో ప్రూవైంది.
తాజాగా బాలీవుడ్ లోగుట్టుపై వివాదాస్పద నటి మీరా చోప్రా చేసిన ట్వీట్ ఈ విషయాల్ని బహిర్గతం చేస్తోంది. మీరా ఇంతకుముందు ఎన్‌టిఆర్ ఎవరో తెలీదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యను చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి విధితమే. తారక్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడడంపై ఇటీవల మీరా చోప్రా ఎమోషనల్ లెటర్ రాయడమే గాక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ సాగుతోంది. ఈలోగానే ఆత్మహత్య చేసుకున్న హీరో సుశాంత్ ఎవరో తెలీదని వ్యాఖ్యానించడం వేడెక్కించింది.
అయితే మీరా తాజా లేఖలో అతడికి క్షమాపణలు చెప్పింది. సుశాంత్ అనగానే బాలీవుడ్ నటుడు అనే విషయం తనకు గుర్తు రాలేదని.. పైగా అతను ఆత్మహత్య చేసుకోవడం అన్న ఆలోచన ఊహకందనిది అని.. అందుకే అలా బదులిచ్చానంటూ ఆమె మతలబుగా జవాబిచ్చింది.
అంతేకాదు.. అతడిని పరిశ్రమ వ్యక్తులు పట్టించుకోలేదని మరోసారి వివాదాస్పద ట్వీట్ చేసింది. అతను జీవించి ఉన్నప్పుడు తనకు సహాయం చేయనందుకు మొత్తం పరిశ్రమ తరపున ఆమె క్షమాపణలు చెప్పింది.
“మేం ఒకే పరిశ్రమలో పని చేస్తున్నాం. జీవిస్తున్నాం. సుశాంత్ చాలా కాలం నుండి నిరాశతో బాధపడుతున్నాడని మనందరికీ తెలుసు. కాని మేం ఏం చేశాం? అంటూ ఆవేదనగా ప్రశ్నించింది. బడా శక్తులు సహాయం అవసరమైనప్పుడు ఎవరికీ సహాయం చేయరని.. పోయిన తర్వాతనే ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశాలు రాస్తారని మీరా చోప్రా ఘాటుగానే విమర్శించారు.
ఇక సుశాంత్ పై ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బావ O.P. సింగ్ అదనపు పోలీసు జనరల్ .. హర్యానా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. సుశాంత్ వ్యవహారంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆయన సమగ్ర దర్యాప్తును కోరుతున్నాడు.
ఆత్మహత్య సంఘటన గురించి తనకు తెలిసిందని సింగ్ ముంబైకి బయలుదేరినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. ఇంతకుముందు సుశాంత్ మేనమామ.. అభిమాని పప్పు యాదవ్ సైతం దీనిపై సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. సుశాంత్ సోదరి చండీఘర్ లో నివసిస్తుంది. ఆమె కూడా ముంబైకి వచ్చారు.
నటుడు రాజ్‌పుత్ మరణం సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి కూడా కోలుకోలేని నష్టమని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ సంతాపం తెలిపారు. మీరా చోప్రా వ్యాఖ్యల్ని బట్టి సుశాంత్ కుటుంబ సభ్యుల వాదనకు బలం చేకూరుతోంది. అది ఆత్మహత్య అని పోలీసులు ధృవీకరించినా ఇంకా దీనిపై అసలు వాస్తవాల్ని శోధించాల్సి ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ స్నేహితులైన రియా చక్రవర్తి.. అతడి మనేజర్ సహా స్నేహితుడిని పోలీసులు విచారిస్తున్నారు. సుశాంత్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ సాగుతోందని తెలుస్తోంది.