పోలీస్ వ్యవస్త ఏం చేస్తోంది.? దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి.? ఓ మాజీ మంత్రి దారుణ హత్యకు గురైతే, హత్య ఎవరు చేశారో తేల్చడానికి రెండేళ్ళు సరిపోలేదంటే, అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా.? చోద్యం చూస్తున్నాయా.? ఓ ఆడ కూతురు తన తండ్రి దారుణ హత్యకు గురైతే.. ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం.. అంటూ న్యాయం కోసం పోరాడీ పోరాడీ అలసిపోతే.. ఏళ్ళ తరబడి న్యాయం జరగకపోవడాన్ని ఏమనుకోవాలి.? వైఎస్ వివేకానందరెడ్డి.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆయన తెలుగు ప్రజలకి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సోదరుడు.
ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చిన్నాన్న. వివేకా మంత్రిగా పనిచేశారు. శాసన సభ, మండలికి ప్రాతినిథ్యం వహించారు. పార్లమెంటుకీ ఎంపికయ్యారు. కడప జిల్లా రాజకీయాల్లో వివేకా తనదైన ముద్ర వేశారు. అలాంటి వ్యక్తి అత్యంత దారుణంగా తన ఇంట్లోనే హత్యకు గురైతే, ‘గుండె పోటు’ అని తొలుత ఎలా వార్త బయటకు వచ్చింది.? రక్తపు మరకలు ఎందుకు కడిగేయాల్సి వచ్చింది.? ఈ ప్రశ్నలకే సమాధానం ఇంతవరకూ దొరకలేదు. వద్ధుడు.. గట్టిగా ముక్కు మూసేస్తే ప్రాణం పోతుంది.. అలాంటిది, అతి కిరాతకంగా పదునైన ఆయుధంతో కసితీరా చంపేశారంటే, ఆ హత్య వెనుక ఎంత బలమైన కారణం వుండి వుండాలి.? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి. కానీ, సమాధానాలు దొరకవు. అదే విచిత్రం వైఎస్ వివేకా హత్య కేసులో. ప్రస్తుతం సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది.. ఇది కూడా ఓ ప్రసహనమై కూర్చుంది. తాను చేస్తున్న న్యాయ పోరాటంలో తనకు అందరూ అండగా నిలవాలని వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మరోమారు మీడియా ముందుకొచ్చారు. ఆ ఆడ కూతురి ఆవేదనను అర్థం చేసుకునేదెవరు.?