శంకర్.. మురుగదాస్ కాదేదీ లీకులకనర్హం
దాచి ఉంచగలిగితే రహస్యం. అయితే ఎంతగా గుప్పిట దాచేయాలనుకుంటే అంతగా రహస్యాన్ని లీక్ చేసేస్తున్నారు! కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ మూవీ `భారతీయుడు 2` లీకుల భారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదని అర్థమవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు వచ్చేస్తూనే వున్నాయి. కమర్షియల్ చిత్రాలకు సమకాలీన అంశాల్ని జోడించి బ్లాక్‌బస్టర్ విజయాల్ని సొంతం చేసుకునే దర్శకుడు ఏఆర్. మురుగదాస్ తొలిసారి తలైవా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ముంబాయి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి `దర్బార్` అనే టైటిల్ ని ఖరారు చేశారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత రజనీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నసినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబాయిలో జరుగుతోంది. దర్శకుడు మురుగదాస్ కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్, నయనతార పాల్గొంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో రజనీకాంత్, డార్క్ బ్లూ కలర్ చుడిదార్‌లో నయనతార కనిపిస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై దర్శకుడు మురుగదాస్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సినిమా చిత్రీకరణకు ముందే స్టిల్స్ బయటికి రావడం సినిమాపై ప్రభావం చూపిస్తుందని చిత్ర వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రాకెట్ స్పీడుతో సినిమాని పూర్తి చేసి వచ్చే ఏడాది పొంగల్‌కి రిలీజ్ చేయాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. చట్టానికి సమాంతరంగా తను రాసుకున్న చట్టాల ప్రకారం దర్బార్ను నడిపించే పోలీస్ ఆఫీసర్ కథాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ప్రీతీక్ బబ్బర్, సునీల్‌శెట్టి, నివేదా థామస్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.