“ప్రేమకథా చిత్రం-2” ట్రైలర్…ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

2013లో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన “ప్రేమకథా చిత్రం” విడుదలై ఎవరూ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. “ప్రేమకథా చిత్రం-2” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా జంటగా నటిస్తున్నారు.

సిద్ధి ఇద్నాని ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. హరికిషన్ అనే దర్శకుడు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఉమెన్స్‌ డేను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.

Prema Katha Chitram 2 Theatrical Trailer || Sumanth Ashwin, Nandita Swetha, Siddhi Idnani

సుమంత్‌, నందిత ప్రేమించుకుంటారు. సుమంత్‌.. సిద్ధి ఇద్నానీని కూడా ప్రేమిస్తాడు. ఓరోజు ఈ విషయం నందితకు, సిద్ధికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నందిత దెయ్యంలా ఎందుకు మారింది? అన్నదే కథ.

చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ… సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, హిందీ శాటిలైట్, డబ్బింగ్ హక్కులు కోటి నలభై మూడు లక్షలకు అమ్ముడయ్యాయని… సినిమాలో ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు హైలైట్ అవుతాయని తెలిపారు.

జీవన్‌ బాబు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌పీఏ క్రియేషన్స్‌ బ్యానర్‌పై సుదర్శన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక గతకొంత కాలంగా సుమంత్ అశ్విన్ నటిస్తున్న సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్నాయి. ఈ సినిమాతోనైనా మంచి హిట్ ను అందుకోవాలని చూస్తున్నాడు సుమంత్ అశ్విన్. మరి ఈ చిత్రం సుమంత్ అశ్విన్ కు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో లేదో చూడాలి.