క‌రోనాతో నిర్మాత‌ల్ని తిప్ప‌లు పెడుతున్న స్టార్ హీరో

కరోనా అంటేనే జ‌నం గ‌జ‌గ‌జ‌లాడిపోతున్నారు. మాయ‌దారి మ‌హ‌మ్మారీ ఎట్నుంచి ఎలా చుట్టేస్తోందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. అయితే ఈ భ‌యం కేవ‌లం సామాన్యుల‌కేనా? అంటే అటు సెల‌బ్రిటీలు అంతే ఒణికిపోతున్నార‌ని ఆ స్టార్ హీరో మాట‌లు చెబుతున్నాయి.

ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నాడంటే క‌రోనా త‌గ్గేవ‌ర‌కూ అస‌లు షూటింగుల‌కు రాను. ఆర్నెళ్ల త‌ర్వాత చూస్కుందాం! అంటూ త‌న నిర్మాత‌కు నిష్క‌ర్ష‌గా చెప్పేశాడ‌ట‌. ఓవైపు నిర్మాత‌లు ఇప్పుడున్న క్రైసిస్ నంచి బ‌య‌ట‌ప‌డేదెలా? అంటూ త‌ల‌లు ప‌ట్టుకుని కూచున్నారు. మిడిల్ లో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి రిలీజ్ చేయాల‌ని నానా తంటాలు ప‌డుతున్నారు. నష్టాలను తగ్గించుకోవ‌డానికి చిత్రనిర్మాతలు నానా ప్ర‌యాస‌లు ప‌డుతున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన నిర్మాతలపై బాంబు పేల్చాడ‌ట‌. కేవలం డబ్బు కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి ఆయన ఆసక్తి చూపడం లేద‌ట‌. కనీసం వచ్చే ఆరు నెలలు షూటింగ్ చేయబోనని చెప్పేశాడ‌ట‌.

“ప‌రిస్థితి సాధారణ స్థితికి వ‌చ్చిన‌ప్పుడు మాత్రమే నేను షూటింగ్ తిరిగి ప్రారంభిస్తాను. అయితే, నేను నా సోలో సన్నివేశాలను నా ఇంటి ప‌రిస‌రాల్లో ఎక్క‌డైనా పూర్తి చేయ‌డానికి సిద్ధ‌మే“న‌ని చెప్పాడ‌ట‌. ఇతర స్టార్ హీరోలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది నిర్మాతలకు మరింత ఇబ్బంది కలిగించేదే. అస‌లే ముంబై సుమారు 30వేల‌ కేసులతో కరోనా కు కేంద్రంగా మారింది. అందుకే స‌ద‌రు స్టార్ హీరో అంత‌గా భ‌య‌పడుతున్నాడ‌న్న‌మాట‌. ఇల్లు దాటి బ‌య‌ట అడుగుపెట్టాలంటేనే షేక్ అవుతున్నాడు మ‌రి. ప్ర‌స్తుతం అక్ష‌య్ కాంచ‌న రీమేక్ ల‌క్ష్మీ బాంబ్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.