ఎవరైనా సహనటుడిపై అవమాన కర వ్యాఖ్యలు చేస్తే సహిస్తారా? అందునా ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో తీవ్రంగా మనోభావాల్ని దెబ్బ తీసే వ్యాఖ్యలు చేస్తే దానిని సహిస్తారా? అందుకే సదరు వెటరన్ కమెడియన్ కి తీవ్రంగా కోపం వచ్చింది. కోపం రావడమే కాదు.. సన్నివేశంలో రివెంజ్ డ్రామా మొదలైంది. ఆయన వెళ్లి నేరుగా ఆర్టిస్టుల సంఘాన్ని సంప్రదించారు. ఆ ఇద్దరు నటులు కొలీగ్స్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇంతకీ ఎవరా వెటరన్ కమెడియన్ అంటే .. ఇంకెవరు ది గ్రేట్ వడివేలు.
ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటి వాడినే ఎదురించిన కమెడియన్ గా అతడి పేరు మార్మోగింది. ఆ తర్వాత రోబో శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితోనూ గొడవలు పెట్టుకున్నాడు. ఆ ఎపిసోడ్స్ పై అభిమానులంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. వడివేలుకు ఆవగింజంత పిచ్చి ఉందని .. అతడి తిక్క దెబ్బకు ఝడుసుకుని దర్శకనిర్మాతలు అవకాశాలివ్వడం మానుకున్నారని ప్రచారమైంది. అదంతా సరే కానీ.. తాజాగా వడివేలు మరోసారి వివాదాల్లోకి వచ్చారు.
ఈసారి ఆయన తన సహనటులు మనోబాలా.. సింగముత్తులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. మనోబాలాకు చెందిన పేపర్ అనే యూట్యూబ్ చానెల్లో తనని అవమానపరుస్తూ వ్యాఖ్యానించారని వడివేలు ఆరోపించారు. నటుడు సింగముత్తును ఇంటర్వ్యూ చేసిన మనోబాలా తనకు సంబంధించిన ఓ అంశాన్ని కెలికారన్నది ఆయన ఆరోపణ. ఇక సింగముత్తుతో వడివేలుకు ఆస్తి పరమైన తగాదాలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం సీరియస్ అయ్యింది. దీంతో దక్షిణభారత నటీనటుల సంఘం (నడిగర సంఘం)లో వడివేలు ఫిర్యాదు చేశారు.
ఇకపోతే టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తిక్కపై మాట్లాడుకున్నట్టే .. అటు తమిళంలోనూ వడివేలు తిక్క గురించి రకరకాల సందర్భాల్లో చర్చ సాగింది. అయితే ఆ ఇద్దరికీ తిక్క ఉన్నా దానికో లెక్క ఉందనేది అభిమానుల మాట. కెరీర్ మ్యాటర్ పరిశీలిస్తే.. వడివేలు ప్రస్తుతం శింబుతో ఓ సినిమా .. కమల్ హాసన్ తో వేరొక సినిమాలో నటించనున్నాడు. రాధాకృష్ణన్ పార్తిబన్ తోనూ వేరొక సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు.