ఫ‌స్ట్ లుక్: కేశ‌వులు కొడుకు పొలం ప‌నికి ఇలా

వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ కు రెండేళ్లుగా స‌రైన స‌క్సెస్ లేదు. గ‌తేడాది ర‌ణ‌రంగం చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. డివైడ్ టాక్ రావ‌డంతో ఆశించిన వ‌సూళ్లు రాలేదు. ప్రస్తుతం శ‌ర్వానంద్ మూడు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే జాను షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉన్నాడు. కీర‌వాణి అనే మరొక చిత్రం సెట్స్ లో ఉంది. కానీ షూటింగ్ కి బ్రేక్ ప‌డిన‌ట్లు స‌మాచారం. అటు శ్రీకారం అనే మ‌రో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లోనూ శ‌ర్వా న‌టిస్తున్నాడు. శ‌ర్వాంద‌న్ 29వ సినిమాగా దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు.

తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజైంది. పోస్ట‌ర్ ని చూడ‌గానే గ్రామీణ నేప‌థ్యం ఉన్న సినిమా ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇందులో శ‌ర్వానంద్ రైతు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. భుజాన తుండు…ప‌సుపు వ‌ర్ణం చొక్కా..గ‌ళ్ల లుంగీ ధ‌రించి ప‌చ్చ‌ని పోలాల గ‌ట్టున న‌డుచుకుంటూ వెళుతున్న పిక్ ని రిలీజ్ చేసారు. ఆ లుక్ లో శ‌ర్వా సిస‌లైన‌ రైతన్న‌ను త‌ల‌పిస్తున్నాడు. చొక్కా మ‌డ‌త పెట్టి కాస్త మొర‌టోడినే అన్న తీరుగా క‌నిపిస్తున్నాడు.

గ‌తంలో `శ‌త‌మానం భ‌వితి` చిత్రంలో ప‌ల్లెటూరి కుర్రాడిగానే క‌నిపించినా.. ఈసారి మ‌రి కాస్త ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు. పార ప‌లుగు ప‌ట్టుకున్న రైత‌న్న అని అర్థ‌మ‌వుతోంది. శ్రీకారం సినిమాలో మాస్ యాక్ష‌న్ కి ఛాన్సుంద‌ని అర్థ‌మ‌వుతోంది. `ఇత‌ను మ‌న కేశ‌వులు కొడుకు.. పొద్దున్నే పొలం ప‌నికి వెళ్తున్నాడు చూడండి` అంటూ యూనిట్ రివీల్ చేసింది. ఇంత‌కీ పొలానికి వెళ్లేది పొలం ప‌నికేనా? లేక ఇంకేదైనానా? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. ఇందులో శ‌ర్వా స‌ర‌స‌న గ్యాంగ్ లీడ‌ర్ ఫేం ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి కిషోర్. బి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మిక్కీజే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ పై రామ్ అచంట‌-గోపీ అచంట నిర్మిస్తున్నారు.