అతడితో నటించాలన్నదే నా కల అంటోంది శ్రద్ధ !

టాలీవుడ్ లో ‘జెర్సీ’ చిత్రంతో మెరిసి తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది శ్రద్ధ శ్రీనాథ్‌. తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ గా మంచి మార్కులను కొట్టేసింది. తమిళంలో ‘విక్రం వేదా’లో మాధవన్‌కు జోడీగా నటించి మెప్పించింది. ‘కే 16’ చిత్రంలో నటించింది కూడా. అజిత్‌ నటించిన ‘నేర్‌కొండ పార్వై’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది.

తన కెరీర్‌లో మరిచిపోలేని సినిమా ఇది అని చెబుతుంది. నిజానికి ‘నేర్‌కొండ పార్వై’ చిత్రంలో నటించడానికి సంబంధించి కొన్ని నెలల క్రితం తనకు ఫోన్‌ వచ్చిందిట. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదట. అసలు ఇందులో నటిస్తున్నానా? లేదా? అనే సందేహం కూడా శ్రద్ధ శ్రీనాథ్‌ కు కలిగిందిట . కొంత కాలం తర్వాత మళ్లీ దర్శకుడు వినోద్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఎంతో ఉత్సాహంగా వెళ్లి నటించిందట. అజిత్‌తో కలిసి నటించాలన్నదే తన కల అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్‌, ఆ కల నెరవేరడంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

అజిత్‌ చాలా మంచి వ్యక్తి అంటూ కలిసిన వారందరితో చెబుతుందట. ‘నేర్కొండ పార్వాయ్‌’ సినిమాలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి పాత్రలో శ్రద్ధ నటించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ‘మీ పాత్రను చూస్తే ప్రేక్షకులు మిమ్మల్ని అసహ్యించుకోవాలి. ఆగ్రహం కలగాలి’ అని దర్శకుడు వినోద్‌ చెప్పడంతో అందుకు తగ్గట్టుగానే నటించిందట. అయితే ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? పాత్ర సరిగ్గా కుదరడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వంటి విషయాలపై శ్రద్ధ మాట్లాడారు.

‘దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత నేను ఇంటర్న్‌షిప్‌ నిమిత్తం దిల్లీ వెళ్లాను. అప్పుడు మా అమ్మానాన్నలతో పాటు నాకు తెలిసినవారు కూడా నా విషయంలో చాలా భయపడ్డారు. ఆ తర్వాత ఈ ఘటన గురించి ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. లైంగిక వేధింపులను నేను తట్టుకోలేను. అందులోనూ పిల్లలు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటే అసలు భరించలేను. ‘నేర్కొండ పార్వాయ్‌’ సినిమాలో నాపై లైంగిక వేధింపులు జరుగుతాయి. ఆ సమయంలో నేను ‘నిర్భయ’ను తలుచుకుంటూ నటించాను. ఆమె ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఆ సమయంలో తప్పించుకోవడానికి ఏం చేసి ఉండేది? నా ఆలోచనలన్నీ వీటి చుట్టూనే తిరుగుతుండేవి’ అని తెలిపారు.

‘లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని ఫలానా నటి మీడియా ముందుకు వచ్చి చెప్పినప్పుడు అందరూ ఆమెపైనే ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులను మాత్రం ఒక్క మాట అనలేదు. దాంతో తాము ఎదుర్కొన్న ఘటనల గురించి చెప్పడానికి భయపడి ఎవరి పని వారు చూసుకుంటున్నారు’ అని చెప్పారు శ్రద్ధ శ్రీనాథ్‌. ఇక ముందు కూడా తాను ఎంపిక చేసుకునే పాత్రలు అందర్నీ ఆలోచింపజేసేవిగానే ఉంటాయని వివరించింది. దటీజ్.. శ్రద్ధ శ్రీనాథ్‌!