ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది.ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ.
ఆ మధ్య తెలుగులో లీడింగ్ పేపరు ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే … ‘నా పేరులో నే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని ఆయన హ్యాట్రిక్ సృష్టించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు.
కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది.
వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది.