ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం ఓ ఉప్పెనలా ఎగిసిన సంగతి తెలిసిందే. ఎందరో సెలబ్రెటీలు నిర్భయంగా బయిటకు వచ్చి తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించారు. కోలీవుడ్ సింగర్ చిన్మయి వివాదం ఇంకా కొనసాగుతోంది. బాలీవుడ్‌లో నటి తనుశ్రీ దత్తా కూడా పదేళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో జరిగిన వేధింపుల గురించి చెప్పారు. నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా కేసు కూడా పెట్టారు. మరో ప్రక్క యాక్షన్ కింగ్ అర్జున్ పై కన్నడ నటి శ్రుతి హరిహరన్ సైతం కేసు పెట్టారు. ఈ నేపధ్యంలో శృంగార తారగా వెలిగిన షకీలా కూడా మీటూ గురించి మాట్లాడారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షకీలాను ‘మీటూ’ ఉద్యమం గురించి ప్రశ్నించారు. ఆమె తన అభిప్రాయం పంచుకున్నారు.
షకీలా మాట్లాడుతూ..‘ ఎవరైనా సరే లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదురైతే అప్పుడే, అక్కడే బయటపెట్టాలి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం తెలివైన పనికాదు. నాకూ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే చాలా మంది ఈ ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పా. ఇప్పుడు నేను వారికి కనిపించినా చేతులు కట్టుకుంటారు’ అని ఆమె అన్నారు.
షకీలా ఒకప్పుడు మళయాళ సినిమాలను..ఆ తర్వాత తెలుగు పరిశ్రమను దడదడాలించిన శృంగార తార. అయితే ఆమె హవా తగ్గి ఆ తర్వాత కామెడీ వేషాలు వేయటం జరిగింది. మెల్లిగా గ్యాప్ కూడా వచ్చేసింది. అయితే చాలా రోజుల తరువాత తన జీవిత చరిత్రలో షకీలా మళ్లీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమైంది.