కొన్ని వివాదాలు అక్కడితో పూర్తిగా తేల్చుకోకపోతే ప్రతీసారి అవి మన ముందుకు వస్తూనే ఉంటాయి. తమ సమస్య తేల్చమని వేధిస్తూంటాయి. ఇప్పుడు భానుప్రియ పరిస్దితి అదే. నిబంధనలకు విరుద్దంగా మైనర్ బాలికను పనిలో నియమించుకున్న నటి భానుప్రియపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… నటి భానుప్రియ తన ఇంటిలో మైనర్ బాలల్ని పనికి నియమించుకుందన్న అంశం కొద్ది కాలం క్రితం మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఒక మహిళ అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భానుప్రియ ఇంటిలో పని చేస్తున్న తన కూతుర్ని ఆమె వేధిస్తోందని, ఆమె నుంచి తన కూతుర్ని కాపాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేసి విచారణ కోసం చెన్నైకి వెళ్లారు.
అయితే భానుప్రియ తన ఇంట్లో పని చేస్తున్న పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదని, అదీ కాకుండా ఆ పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందనీ స్థానిక టీనగర్, పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది . దాంతో ఆ కేసు అటూ ఇటూ తేలకుండా అలా ఉండిపోయింది.
ఈ విషయం అలా ఉంచితే బుధవారం బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని పురష్కరించుకుని బాల కార్మికుల పరిరక్షణ సమాఖ్య బాలకార్మికుల గురించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆ సమాఖ్య నిర్వాహకుడు శేషారత్నం మాట్లాడుతూ మైనర్ బాలలను పనిలో చేర్చుకున్న నటి భానుప్రియపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బాలకార్మికుల చట్టం ప్రకారం పిల్లలను పనికి చేర్చుకుంటే రూ.50వేల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలియచేసారు.