తెలుగు సినిమాకు కష్టకాలమేనా?
తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెరిగినా థియేటర్ల నుంచి రికవరీ మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదన్నది తాజా విశ్లేషణ. ముఖ్యంగా సెప్టెంబర్ లో రిలీజైన చిత్రాలు ఆశించిన స్థాయిలో లాభాల్ని అందించలేకపోయాయి. ఆగస్టు 30న విడుదలైన `సాహో` రెండు వారాల్లోనే పెట్టిన పెట్టుబడిని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి కానీ అది జరగలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 65 శాతం మాత్రమే రికవరీ చేసి భారీ స్థాయిలో నష్టాలతో ఈ సినిమా రిజల్ట్ నిరాశపరిచింది. `బాహుబలి` విజయం తరువాత మార్కెట్ భారీగా పెరగడంతో దాన్ని చూపించి భారీ స్థాయిలో బిజినెస్ చేసుకున్నారే కానీ రికవరీని మాత్రం సాధించలేకపోయారు.
`నానీస్ గ్యాంగ్‌లీడర్` అయినా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించి పూర్వ పరిస్థితిని సాధిస్తుందని అంతా భావించారు. కానీ 70 శాతం వసూళ్లని కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయి నాని కెరీర్‌లో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీస్ `రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆ స్థాయి హిట్‌ని అందుకోలేకపోయింది. ఇక ఇదే నెలలో వచ్చిన `గద్దలకొండ గణేష్` మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. `దేవత` చిత్రంలోని `ఎల్లువొచ్చి గోదారమ్మ..` పాటతో సినిమాకు మంచి బూస్టప్ నిచ్చారు. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా క్రేజ్‌ని చూసి బ్లాక్‌బస్టర్‌గా తేల్చారు. కానీ బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ సినిమా ఆపసోపాలు పడుతోందని ట్రేడ్ లో వినిపిస్తోంది. 80శాతం రికవరీ అయినా మిగతాది రాబట్టాల్సి ఉంది.
అక్టోబర్ 2న `సైరా` రిలీజవుతోంది. ఆ సినిమాపై క్రేజు కారణంగా ఆ టార్గెట్ ని వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ రీచ్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. సూర్య నటించిన `బందోబస్త్` ఇప్పటికే డిజాస్టర్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో `గద్దలకొండ గణేష్`కు ఎదురులేదని అంతా భావించారు. కానీ `సైరా`తో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మొన్న శుక్రవారం మూడు సినిమాలు రిలీజయ్యాయి. రాయలసీమ లవ్ స్టోరి సహా మరో రెండు వచ్చినట్టే ఎవరికీ తెలీదు. ప్రచారం లేని శుక్రవారంగా మిగిలిపోవడం వర్షాల కారణం గా జనాలు థియేటర్లకు వెళ్లలేదు. దీంతో అవి ఏమయ్యాయో ఎవరికీ తెలీని పరిస్థితి. దీంతో సెప్టెంబర్ నెలలో విడుదలైన ఏ సినిమా డీసెంట్ వసూళ్లని రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు బోరుమంటున్నాయి.