సంస్కృతంలో అక్కినేని ఆలోచనలు … 

మహా  నటుడు అక్కినేని నాగేశ్వర రావు ఏడవ తరగతి మాత్రమే చదివినా ప్రపంచాన్ని చదివిన అనుభవంతో మనల్ని నివ్వెర పరుస్తాడు . తెలుగు తమిళ , హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడతారు . ” సాధనమున పనులు సమకూరు ధరలోన ..” అన్న  వేమన్న మాటలను అక్కినేని నిజం చేశాడు . తనకు చదువు రాదు అన్న ఆత్మ న్యూనతా భావమే ఆయనలో పట్టుదలను పెంచాయి . ప్రతిదినం హిందూ పేపర్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు . 1964 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానం పై అక్కడికి వెళ్లి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి అందరిని ఆశ్చర్య చకితులను చేశాడు . 

సినిమాల్లో మాటల సారాంశాన్ని గ్రహిస్తూ , సినిమా జర్నలిస్టులు రాసే వ్యాసాలూ చదువుతూ జ్ఞాన సముపార్జున చేశానని చెప్పుకొనేవాడు . తనలో మెదిలే ఆలోచనలను కాగితంపై  పెట్టేవాడు . అలా వ్రాసిన వాటిని తన రజతోత్సవ సంవత్సరం సందర్భంగా  ( 8-5-1959— 7-5-1970 ) పుస్తకంగా ప్రచురించాడు . అదే 

“అ ఆలు “.  ఈ పుస్తకం లో అక్కినేని ఇలా వ్రాసుకున్నాడు . ” సత్య దర్శనానికి  విమర్శనే ఉత్తమ మార్గం, ఆత్మా విమర్శ కల వ్యక్తికే  ఇతరుల విమర్శ  విలువలు  అర్ధమవుతాయి .  అర్ధం చేసుకోగల వ్యక్తే  సత్య దర్శన మార్గంలో  నిజమైన బాటసారి “. 

అలాగే ఈ పుస్తకాన్ని ఆయన జర్నలిస్టులకు అంకితం చేశాడు .  నా నట జీవితానికి , జీవితానికి  సత్య మార్గాన్ని చూపిన , సహాయం చేసిన , సహృదయులు,  సద్విమర్శకులు , అయిన పత్రికా రచయితలందరికీ  కృతజ్ఞతతో ఈ  నా అ ఆలను  సమర్పిస్తున్నాను ” ఈ పుస్తకం అప్పట్లో ఎందరినో విశేషంగా ఆకట్టుకుంది . 1984లో ఈ  మళ్ళీ ప్రచురించారు . 

అక్కినేని నాగేశ్వర రావు 20 సెప్టెంబర్ 1924న జన్మించాడు . 22 జనవరి 2014న చనిపోయాడు . ఈనెల 20న ఆయన 95వ జయంతి  సందర్భంగా అక్కినేని ఆలోచనలు  పుస్తకాన్ని సంస్కృతంలో  “అక్కినేని అనుచింత నాని ” పేరుతో ప్రచురిస్తున్నారు . 

కళాకారులకు మరణం లేదని అంటారు . తెరపైన వారు సదా మనకు  దర్శనం ఇస్తూనే వుంటారు . ఇక అక్కినేని తన ఆలోచనలను చనిపోయిన తరువాత కూడా ఈ తరానికి  పంచుతున్నారు ..!