‘మీటూ’ ఉద్యమ నేపధ్యంలో చాలా మంది సినీ సెలబ్రెటీలు తమ గత అనుభవాలను మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అవి చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అవి కొందరు కేవలం కావాలని చేసే ఆరోపణలుగా కూడా కొట్టిపారేస్తున్నారు. మరికొంతమంది సిని పరిశ్రమలో అవకాశాలు కోల్పోతున్నారు.
ఆధారాలు అనేవి పెద్దగా లేకపోవటంతో…ఏది నిజమో ..ఏది అబద్దమో తెలియని సిట్యువేషన్ చాలా చోట్ల ఏర్పడుతోంది. దాంతో సీనియర్స్ ఎవరూ ఈ విషయమై నోరు మొదపటం లేదు. కలగచేసుకోవటం లేదు. దాంతో ఇలా మీటూ అంటూ ముందుకు వచ్చిన వారికి పరిశ్రమ పరంగా కొన్ని సమస్యలు వస్తున్నాయి. అలాంటి సమస్యలే సంజనకు కూడా వచ్చాయి. దాంతో ఆమె తన ఆరోపణలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా క్షమాపణ చెప్పారు.
వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ చిత్రం మర్డర్ రీమేక్ గా వచ్చిన తన మొదటి చిత్రం ‘గండ-హెండతి’ చిత్రీకరణ సమయంలో దర్శకుడు రవి శ్రీవాత్సవ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆరోపణలు చేసిన నటి సంజన గల్రాని క్షమాపణలు చెప్పారు.
చిన్నవయసులో తాను షూటింగ్ సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పడం వెనుక దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. దర్శకుడు శ్రీవాత్సవ, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్, సంఘం కార్యదర్శి ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పారు.
సంజన క్షమాపణలు చెప్పేంత వరకు ఆమెను కన్నడ చిత్రాల్లో నటించేందుకు అవకాశం కల్పించబోమంటూ గతంలో దర్శకుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె క్షమాపణలు చెప్పారు.