`కొబ్బ‌రి మ‌ట్ట‌`తో కొట్టేస్తారు జాగ్ర‌త్త‌

క్రియేటివిటీ కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హిట్ట‌య్యే వీలుంది. స్టార్ ప‌వ‌ర్ లేకుండానే విజ‌యం సాధ్య‌మ‌వుతోంది. మంచి క‌థ‌తో పాటు గ్రిప్పింగ్ నేరేష‌న్ తో మెప్పిస్తే లేదా వైవిధ్య‌మైన కంటెంట్ తో వ‌స్తే జ‌నం ఆద‌రిస్తున్నారు. ఆ త‌ర‌హాలోనే క‌రీంన‌గ‌ర్ కుర్రాడు సంపూర్ణేష్ బాబు సినీఎంట్రీ అంతే పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. అత‌డు వ‌స్తూనే హృద‌య కాలేయం అంటూ వెరైటీని ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టివ‌ర‌కూ స్టార్ల‌కు భ‌జ‌న చేసే భ‌జంత్రీ స‌మాజంపై ఎడా పెడా సెటైర్ల‌తో సంపూ విరుచుకుప‌డిన తీరు యూత్ కి బాగా న‌చ్చింది. ఫ‌న్ వ‌ర్క‌వుటైంది. అందుకే తొలి ప్ర‌య‌త్న‌మే విజ‌యం అందుకున్నాడు. అయితే అది ఒక ర‌కంగా అత‌డికి ప్ల‌స్ అయినా మ‌రో కోణంలో మైన‌స్ కూడా అయ్యింది. కెరీర్ ప‌రంగా సంపూర్ణేష్ ఒక అడుగు ముందుకు ప‌ది అడుగులు వెన‌క్కి వేయ‌డానికి కార‌ణం ఇక్క‌డ స్టార్లు సెటైర్లు అంగీక‌రించ‌ర‌న్న న‌గ్న‌స‌త్యమే. ఇండ‌స్ట్రీ స్టార్ హీరోల సినిమాల్లో సంపూర్ణేష్ కి క‌నీసం స‌హాయక పాత్ర‌ల్లో అయినా అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. అడ‌పాద‌డ‌పా మంచు కాంపౌండ్ మిన‌హా ఇత‌ర అగ్ర హీరోలెవ‌రూ పిలిచి ఛాన్సులివ్వ‌లేదు.

అయినా కెరీర్ ని తెలివిగా నెట్టుకొస్తున్నాడు. ఇటీవ‌ల బాగా గ్యాప్ వ‌చ్చింది. ఆర్థిక కార‌ణాల‌తో సినిమా ఆల‌స్య‌మైంది. ప్ర‌స్తుతం కొబ్బ‌రి మ‌ట్ట‌ అంటూ మ‌రో సెటైరిక‌ల్ కామెడీతో వ‌స్తున్నాడు. ఈ సినిమా పోస్ట‌ర్లు.. ప్రీవిజువ‌ల్స్ ఆస‌క్తిని పెంచాయి. మునుప‌టిలానే ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టే పెద‌రాయుడు .. పాపారాయుడు.. ఆండ్రాయుడు.. అంటూ అత‌డి గెట‌ప్పులు పాపుల‌ర‌య్యాయి. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ లో పాట‌ల్లో సంపూర్ణేష్ డ్యాన్సుల‌కు ప‌డి ప‌డి న‌వ్వుకున్నారు జ‌నం. అత‌డి హార్డ్ వ‌ర్క్ మ‌రోసారి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. హృద‌య కాలేయం ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ క‌థ అందించారు. ఆయ‌నే నిర్మాత కూడా. ఈనెల 10న అంటే శ‌నివారం నాడు సినిమా రిలీజ‌వుతోంది. అదే రోజు వేకువ‌ఝాము 5గంట‌ల‌కు ప్రొద్దుటూరు సినీహ‌బ్ లో కొబ్బ‌రిమ‌ట్ట బెనిఫిట్ షో వేస్తుడ‌డం గ్రేట్ ఫీట్. ఒక‌టి కాదు రెండు షోలు వేసేంత‌గా టిక్కెట్లు సేల్ అయ్యాయిట మ‌రి. అంతా బాగానే ఉంది కానీ ట్రైల‌ర్ లో ఉన్నంత మ్యాట‌ర్ సినిమాలో లేక‌పోతే మాత్రం ఫ్యాన్స్ కొబ్బ‌రిమ‌ట్ట‌తో కొట్టేస్తారేమో .. కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి సుమీ!!