గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడా.. స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజు ఉంటది!
.. నిజమే ఆ డైలాగ్ కి తగ్గట్టే సాహో
ట్రైలర్ తో సిక్సర్ కొట్టాడు డార్లింగ్. టీజర్, మేకింగ్ వీడియోల తర్వాత ట్రైలర్ తో మరోసారి అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ ఏ స్థాయి సినిమాలో నటిస్తున్నాడు? అనేదానికి ఈ ట్రైలర్ సరైన సమాధానం. సాహో తో మరో లెవల్ యాక్షన్ ని ఎటెంప్ట్ చేస్తున్నాడనే అర్థమవుతోంది. ఆగస్టు 30 రిలీజ్ కాబట్టి అప్పటివరకూ అభిమానులు పదే పదే రిపీటెడ్ గా చూసే వీలున్న ట్రైలర్ ఇది.
ఈ సినిమాలో మాఫియా అండర్ కవర్ ఆపరేషన్ అన్నదే ఆసక్తికర ఎలిమెంట్. ఇందులో లవ్.. యాక్షన్.. క్రిమినల్స్ మైండ్ గేమ్.. గ్యాంగ్ స్టర్స్.. ఇలా ఏ కోణంలో చూసినా ఇంట్రెస్టింగ్. విజువల్స్ హాలీవుడ్ స్టాండార్డ్స్ ని టచ్ చేశాయి. ముఖ్యంగా దుబాయ్ బ్యాక్ డ్రాప్ లో భారీ భవంతుల నడుమ ఆ విజువల్స్ మతి చెడగొట్టాయి. వీఎఫ్ఎక్స్ పనితనం మైండ్ బ్లోయింగ్. ట్రైలర్ లో డైలాగుల్ని బట్టి ఇది గ్యాంగ్ స్టర్ గుంపుతో తలపడే అండర్ కవర్ పోలీసాఫీసర్ కథ అని అర్థమవుతోంది. “ముంబైలో 2000 కోట్ల రోబరీ జరిగింది. అది చేసిందెవరో మనకు తెలీదు“ అంటూ స్ట్రెయిట్ గా కథను ఓపెన్ చేసేశారు ట్రైలర్ లోనే. ఈ కేసును ఒక అండర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తారు… అంటూ డార్లింగ్ ప్రభాస్ ని పరిచయం చేసిన తీరు మైండ్ బ్లోయింగ్. అమృత నాయిర్ క్రైమ్ బ్రాంచ్ అంటూ శ్రద్ధా కపూర్ పాత్రను రివీల్ చేశారు. ప్రభాస్ – శ్రద్ధా జోడీ పోలీస్ అధికారులు. ఆ ఇద్దరి ప్రేమలోని ట్రాజెడీ ఆసక్తికరం. డే అండ్ నైట్ లా ఒకటి వస్తే ఇంకొకటి వెళుతుంది. అవి రెండూ ఎప్పటికీ కలవవు.. అంటూ శ్రద్ధా చెబుతున్న డైలాగ్ ఆకట్టుకుంది. ఇంత సీరియస్ డ్రామాలోనూ వెన్నెల కిషోర్ కామెడీ రిలీఫ్ నిస్తుందేమో చూడాలి. `సాహో` ట్రైలర్ నిరాశపరచలేదు. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుంది? అన్నది తెరపై చూసి చెప్పాల్సిందే. సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది.