అమెరికాలో డార్లింగ్ తురుములే…..!
నాన్ బాహుబలి రికార్డులపై రెగ్యులర్ డిబేట్ చూస్తున్నదే. టాలీవుడ్ లో ఉన్న అరడజను స్టార్ హీరోలు ఈ రేసులో పోటీపడుతూనే ఉన్నారు. ఆ కోవలో చూస్తే అమెరికాలో నాన్ బాహుబలి కేటగిరీలో నంబర్ వన్ రికార్డ్ రామ్ చరణ్ `రంగస్థలం` పేరిట నమోదైంది. మహేష్ – ఎన్టీఆర్ లాంటి స్టార్లకు మిలియన్ డాలర్ క్లబ్ కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు బాహుబలి 2 రికార్డులకే చెక్ పెట్టేస్తూ `సాహో` అమెరికా ప్రీమియర్ల నుంచి భారీ మొత్తాల్ని కలెక్ట్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ఇంటా బయటా ఓ కుదుపు కుదిపేస్తోంది. ఓపెనింగ్ డే.. ఓపెనింగ్ వీకెండ్ అన్ని కోణాల్లోనూ రికార్డులు బ్రేక్ చేయనుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ చూస్తే.. ఐమాక్స్ షోలు, రెగ్యులర్ షోస్ బుకింగుల ద్వారా అన్ని భాషలలో కలిపి $532,727 వసూలైంది. కేవలం తెలుగు వెర్షన్ ఐమాక్స్ షోలు, రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $511,702 వసూల్ చేస్తోంది. హిందీ వెర్షన్ – $16,899, తమిళ వెర్షన్ – $4,126 కలెక్ట్ చేస్తోంది. అన్ని భాషల్లో ఐమాక్స్ షోల వరకు $77418 , రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $455309 వసూల్ చేస్తోంది. కేవలం ప్రీమియర్లతోనే భారీ మొత్తాల్ని వసూలు చేయనుందని తెలుస్తోంది.ఆగస్టు 28 వరకూ బుకింగ్స్ రిపోర్ట్ ఇది.
అమెరికా నుంచి తొలి 100 కోట్ల క్లబ్ సినిమాగా బాహుబలి 2 సంచలనం సృష్టించింది. దాదాపు 450 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం తొలి వీకెండ్ నాటికే 10 మిలియన్ డాలర్ (73 కోట్లు) క్లబ్ లో అడుగు పెట్టి సంచలనం సృష్టించింది. అందుకే ఇప్పుడు సాహో ఉత్తర అమెరికాలో ఏ స్థాయి రికార్డుల్ని నెలకొల్పనుంది? అన్న క్యూరియాసిటీ నెలకొంది.