నా రణబీర్‌ ఇంకా దొరకలేదు: రుహానీ శర్మ ఇంటర్వ్యూ

‘ప్రతి ఒక్కడికీ కట్రినా కైఫ్‌ కావాలి. బట్‌, ఎవడూ రణబీర్‌లా ఉండడు’ – ‘చి.ల.సౌ’ సినిమా టీజర్‌లో హీరోయిన్‌ డైలాగ్‌! ప్రతి ఒక్కరికీ ఈ డైలాగ్‌ కనెక్ట్‌ అయ్యింది. హీరో నుంచి దర్శకుడిగా మారుతున్న రాహుల్‌ రవీంద్రన్‌ భలే డైలాగ్‌ రాశాడనుకున్నారు. ఆ వెంటనే ఆడియన్స్‌ దృష్టి హీరోయిన్‌ మీద పడింది. ‘భలే వుందీ అమ్మాయి. ఎవరు?’ అనుకున్నారు. ఆమే రుహానీ శర్మ. ‘చి.ల.సౌ’తో తెలుగు తెరకు, వెండితెరకు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ అవుతోంది. ఆగస్టు 3న ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా రుహానీతో ఇంటర్వ్యూ…

 

హాయ్‌! ఎలా వున్నారు?

అయామ్‌ గుడ్‌! సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది కదా! కొంచెం టెన్షన్‌గానూ, కొంచెం హ్యాపీగానూ వుంది.

ఇంతకీ, తెలుగు మాట్లాడటం వచ్చేసిందా?

లేదండీ! ఎవరైనా మాట్లాడితే అర్థం అవుతోంది. కానీ, తెలుగులో సమాధానం చెప్పలేను. నేను ఉత్తరాది అమ్మాయిని కదా! తెలుగు రాదు. షూటింగ్‌ మొదలైన కొత్తల్లో అసలు అర్థం అయ్యేది కాదు. తర్వాత తర్వాత మెల్లగా నేర్చుకున్నా.

ఉత్తరాదిలో ఎక్కడ? మీ ఫ్యామిలీ గురించి?

హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలాంగ్‌ వ్యాలీ. నాన్న రెవెన్యూ ఆఫీసర్‌. అమ్మ టీజర్‌. నాకు ఓ అక్క వుంది. తను మెడిసిన్‌లో పీహెడ్‌డీ చేస్తోంది. నేను చండీఘర్‌లో చదువుకున్నా. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశా. నాకు చదువంటే ఆసక్తి లేదు. సినిమాల్లో నటించాలని కోరిక. కానీ, ఇంట్లో ఒప్పుకోలేదు. ముందు పీజీ చేయమని చెప్పారు. అది చేశాక… అవకాశాల కోసం ప్రయత్నించా.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?

చదువు పూర్తయ్యాక ముంబై వచ్చేశా. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో నటించా. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ సినిమా ఛాన్స్‌ వచ్చింది. కథ నచ్చడంతో ఓకే చెప్పా.

ఇందులో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?

సింపుల్‌ అండ్‌ ట్రెడిషనల్‌ క్యారెక్టర్‌. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌… వెరీ స్ట్రాంగ్‌ గాళ్‌. తనకు ఏం కావాలో బాగా తెలిసిన అమ్మాయి. సినిమాలో నా పాత్ర పేరు అంజలి. రియల్‌ లైఫ్‌లో నేను ఆమెలా అసలు ఉండను. దాంతో ఈ క్యారెక్టర్‌ చేయడం ఛాలెంజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంతకు మించి ఏం చెప్పలేను.

సినిమా కథేంటి?

అర్జున్‌, అంజలి చుట్టూ కథ తిరుగుతుంది. కథంతా ఒక్క రోజులోనే జరుగుతోంది. అర్జున్‌కి పెళ్లంటే ఇష్టం ఉండదు. అంజలి కంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఒక్క రోజులో వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారనేది కథ.

టీజర్‌లో ప్రతి ఒక్కడికీ కట్రినా కైఫ్‌ కావాలి. బట్‌, ఎవడూ రణబీర్‌లా ఉండడుఅని డైలాగ్‌ చెప్పారు. మీ ఫీలింగ్‌ కూడా అదేనా?

హాహాహా… అబ్బాయిలు ‘ప్రతి అమ్మాయికి రణబీర్‌ కావాలి. కానీ, ఎవరూ కట్రినా కైఫ్‌లా ఉండరు’ అనుకుంటారు కదా! మనం కాయిన్‌కి రెండు వైపులా చూడాలి. టీజర్‌లో ఆ డైలాగ్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇంతకీ రియల్‌ లైఫ్‌లో మీకు రణబీర్‌ దొరికాడా?

ఇంకా దొరకలేదు. అయినా… రియల్‌ లైఫ్‌లో రణబీర్‌ కపూర్‌ ఇక్కడే వున్నాడు (నవ్వులు).

ఒకవేళ అతనే వచ్చి మీకు ప్రపోజ్‌ చేస్తే…

అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. నాకిష్టమైన హీరోల్లో అతనొకడు. తను ప్రపోజ్‌ చేస్తే… ఒక్క నిమిషం గుండె ఆగుతుంది.

తెలుగులో నెక్ట్స్‌ ఏ సినిమాకి సైన్‌ చేశారు?

ఇంకా దేనికి చేయలేదు. రెండు మూడు అవకాశాలు వచ్చాయి. అయితే… ‘చి.ల.సౌ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నా.

అసలు, మీరు ఇంతకు ముందు తెలుగు సినిమాలు చూశారా?

చూశా. అంటే.. తెలుగులో కాదు. హిందీ ఛానల్స్‌లో డబ్బింగ్‌ వస్తాయి కదా! అవన్నీ చూసేదాన్ని. నాగార్జునగారు, అల్లు అర్జున్‌ సినిమాలు ఎక్కువ చూశా. ఇక్కడికి వచ్చాక నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘నేను లోకల్‌’, ‘ఎంసిఎ’ సినిమాలు తెలుగులో చూశా. అంటే… సబ్‌ టైటిల్స్‌ పెట్టుకున్నాను అనుకోండి. ఇకపై ఎక్కువ తెలుగు సినిమాలు చూస్తా. తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తా.