రియాతో వాట్సాప్ చాట్ లో సుశాంత్ నిందలు ఎవరిపై?
సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణంలో రోజుకో ట్విస్టు బయటపడుతోంది. ఇందులో ప్రియురాలు రియా చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సుశాంత్ సింగ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయమవ్వడంతో.. మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి రియా.. తన సోదరుడు షోయిక్.. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ రితేష్ షా.. మాజీ మేనేజర్ శ్రుతి మోదీలను 8 గంటలకు పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తదనంతరం ఒక రోజు తర్వాత రియా తనకు సుశాంత్ తో ఉన్న అనుబంధం గురించిన వాట్సాప్ చాట్లను బయట పెట్టడం కలకలం రేపుతోంది.
ఈ చాటింగ్ ప్రకారం.. సుశాంత్ కి తన సోదరితో కానీ బావ గారితో కానీ అస్సలు సత్సంబంధాలు లేవనేది రియా వెర్షన్. తాగి తిట్టుకునే వ్యక్తిత్వం అంటూ సుశాంత్ సింగ్ తన సోదరి సహా బావను తిట్టిన వ్యవహారం ఆ చాట్ లో ఉంది. అసలు తాను కానీ తన కుటుంబం కానీ లేనిదే సుశాంత్ కి మనశ్శాంతి లేనే లేదన్న ఆధారాన్ని రియా చూపించే ప్రయత్నం చేసింది. అయితే రియా- సుశాంత్ చాటింగ్ లో ఉన్నది నిజమేనా? అందులో వాస్తవమెంత? అన్నది సీబీఐ విచారణలో తేలాల్సి ఉంటుంది.
సుశాంత్ జూన్ 14 న బాంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకున్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబై పోలీసుల విచారణపై అనుమానం వ్యక్తం చేస్తూ బిహారీ పోలీసులు కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించడం సంచలనమైంది. దివంగత హీరో సుశాంత్ తండ్రి కెకె సింగ్ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో రియా ఆత్మహత్యకు పాల్పడిందని.. మనీలాండరింగ్ కి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి.
ప్రియురాలితో సుశాంత్ వాట్సాప్ చాట్ లు దేనిని నిరూపిస్తాయి? అన్నది అటుంచితే.. నా జీవితంలో మార్పుకు.. ఈ ఆనందానికి రియా.. ఆమె కుటుంబమే కారణమని సుశాంత్ ఆనందం వ్యక్తం చేసినట్టు వాట్సాప్ చాట్ లో ఉంది. అలాగే తన సోదరి తన స్నేహితులను తారు మారు చేస్తుందన్న వ్యాఖ్య కూడా కనిపిస్తోంది. అయితే ఎప్పుడో జరిగిన వాట్సాప్ చాట్లను నేటి పరిస్థితులకు అన్వయించుకోవడం అన్నది ఎంతవరకూ సబబు అన్నది సీబీఐ విచారనలో తేలుస్తుంది. నిజాలు నిగ్గు తేల్చాల్సినది దర్యాప్తు చేసే అధికారులే.