బాలీవుడ్ క్వీన్ నిజంగానే వీరనారి.. ఏకంగా మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేతోనే పెట్టుకుంది. పదితలల రావణుడితో పోల్చుతూ పోస్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. గత కొన్ని రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య పచ్చ గడ్డి వేసే భగ్గుమనేలా వ్యవహారం నడుస్తోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు, బెదిరింపులకు కంగనా అంతే స్థాయిలో ధీటుగా బదులిస్తూ నిలబడుతోంది. ఇక కంగనాకు బీజేపీ మద్దుతు ఉండటంతోనే ఇంతలా రెచ్చిపోతోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
తన కార్యాలయాన్ని అక్రమ కట్టడమన్న నెపంతో కూల్చివేయడంపై ఉద్దవ్ థాక్రేపై ఫైర్ అయింది. నీ అహంకారం కూడా కూలిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్రంలో నెలకొన్ని ఉన్న పరిణామాలపై తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే స్పందించారు. కొందరు కరోనా అయిపోయిందని భావించి, రాజకీయాలను ప్రారంభించేశారని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్రను బద్నాం చేయడానికి కొందరు రాజకీయాలు చేస్తున్నారని, ప్రస్తుతం తానేమీ మాట్లాడనని అన్నారు.
ప్రస్తుతం తన దృష్టి అంతా కరోనా కట్టడిపైనే ఉందని అన్నారు. మహారాష్ట్రను అపఖ్యాతి పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సరైన సమయంలో దీనిపై స్పందిస్తానని అన్నారు. తాను మౌనంగా ఉంటే సమాధానం లేదని కాదని, దాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ‘సీఎం ప్రోటోకాల్’ను పక్కనెట్టి మరీ మాట్లాడతానని కాస్త గట్టిగానే ఇచ్చుకున్నాడు. మరి వీటిపై కంగనా రనౌత్, బీజీపీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.