ముందుగా ప్రకటించినట్లుగానే రామ్ గోపాల్ వర్మ ..వెన్నుపోటు సాంగ్ ని విడుదల చేసారు. ‘దగా.. దగా.. మోసం.. నమ్మించి.. కమ్మించి వెన్నుపోటు పొడిచారు. వంచించి వంచించి వెన్నుపోటు పొడిచారు కుట్ర కుట్ర’ అంటూ పాట ప్రారంభమవుతోంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేశారంటూ.. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి ఉన్న ఆనాటి ఫోటోలను చూపిస్తూ బ్యాంగ్రౌండ్‌లో పాట ప్లే చేసారు.
ఈ పాటను వర్మ ఆస్దాన రచయిత సిరాశ్రీ రాసారు. కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ పాట పాడటంతో పాటు సంగీతం కూడా అందించారు. అయితే చిత్రమేమిటంటే అంత గొప్పగా అయితే పాట లేదు. వినసొంపుగా అంతకన్నా లేదని సోషల్ మీడియాలో వర్మ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు.
డిసెంబర్ 21 అంటే ఈ రోజు వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు. ఆ రోజున వెన్నుపోటు సాంగ్ ని విడుదల చేయటం..ఆ వర్గానికి సపోర్ట్ ఇచ్చినట్లే, జగన్ కు గిప్ట్ ఇచ్చినట్లే అని సోషల్ మీడియాలో ఓ వర్గం ఇప్పటికే ప్రచారం మొదలెట్టింది. మరో వర్గం…వర్మ కావాలని ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ కు కౌంటర్ ఇవ్వటానికి వెన్నుపోటు పాటను విడుదల చేస్తున్నాడంటున్నారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు అర్దం చేసుకునేలా వర్మ వివాదం సృష్టించి మరీ పాటను వదిలారు. ఆ పాటను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయానికి వస్తే… ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ.