మాటల మాంత్రికుడిపై మండిపడుతున్న సీమ జనం

(యనమల నాగిరెడ్డి)

అరవింద సమేత త్రివిక్రమ్ లక్ష్యంగా రాయలసీమలో విమర్శల దాడి. మాటల మాంత్రికుడు, సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్న త్రివిక్రమ్ కు ఇటీవల నిర్మించిన “అరవింద సమేత వీర రాఘవ” కాసుల పంట పండించినా,  రాయలసీమలో ఆగ్రహజ్వాలలు రగిలించింది. ఫ్యాక్షన్ రాయలసీమను కన్నతల్లిని చేయడం ఈ ప్రాంత వాసులను బాధిస్తున్నది.

“నీతుల సుద్దులు  చెప్పే ఈ పెద్దమనిషికి ఏ మాత్రం విలువలు లేవని”  అయినా భారీ డైలాగులతో తాను వ్రాసిన కథలు, పుస్తకాలనుండి కొన్ని అంశాలు కాపీ కొట్టి  సినిమాని రక్తి కట్టించి సొమ్ము చేసుకున్నారని, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వేంపల్లి గంగాధర్  ఈ మాటల గారడీ సార్ పై మండిపడుతున్నారు.

 

తన సినీ ప్రయాణంలో  అదోగతి చేరిన త్రివిక్రమ్  అందులో నుండి బయటపడి ఒక హిట్ సాధించి, సొమ్ముచేసుకోవాలన్న కక్కుర్తితో  తాను దిగజారి, “ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్నిదిగజార్చి చూపించిన విధానం” అత్యంత హేయమైనదని కళాసాగర్ రెడ్డి మండిపడ్డారు.

 

ఈ సినిమాలో తమ ప్రాంతాన్ని అవమానించిన విధానానికి కినిసి, తమ ఆవేదనను అందరికీ తెలియచేసి, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని త్రివిక్రం ను హెచ్చరించిన   రాయలసీమ యువ పోరాటవీరుల ఆక్రందనలు “ఈ మాటల గారడీ వీరుడికి వినిపిస్తాయా”? అన్నది వేచి చూడాల్సిందే.

 

రాయలసీమ యువ పోరాటవీరుల ఆగ్రహం

రాయలసీమ సమస్యలపై గత నాలుగు సంవత్సరాలుగా తీవ్రంగా పోరాడుతున్న నలుగురు యువ పోరాటవీరులు, ఈ సినిమాలో రాయలసీమ చరిత్ర, భాష, యాసను  ఉపయోగించిన విధానం, సంస్కృతిపై చేసిన దాడి, తీసిన విధానంపై తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసి తిరిగివెళుతున్న క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో “జలం శీను”  దుర్మరణం చెందగా, రవి మృత్యువుతో పోరాడుతున్నారు. పెద్దరాజా, సీమ కృష్ణ ప్రాణాపాయం తప్పించుకున్నా బ్రతకడం కోసం కేర్ ఆసుపత్రిలో పోరాడుతున్నారు. ఇందుకు త్రివిక్రమే పూర్తిగా భాద్యత వహించాలని సీమ ఉద్యమ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ పేరుతో సొమ్ములుదండుకున్న త్రివిక్రమ్ భాద్యత తీసుకుని వీరిని వైద్య పరంగా ఆదుకోవాల్సిందే అంటున్నారు ఆ నాయకులు.  

 

వేంపల్లి గంగాధర్  అసంతృప్తి   

నీతులు భోదించడంలో ఘనుడు. విలువల గురించి భారీ డైలాగులు వ్రాయగల ఘనాపాటీ త్రివిక్రమ్ అని, అయితే వాటిని అమలు చేయడంలో చివరి స్తానం మాత్రమే పొందగల మేటి ఆ సినీ మాంత్రికుడేనని కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, కథా రచయిత వేంపల్లి గంగాధర్ ఫేసుబుక్ లాంటి సామాజిక మాధ్యమాలలో  మండిపడుతున్నారు.

గత ఏప్రిల్ 15 వ తెదీన త్రివిక్రమ్ పిలుపు మేరకు రామోజీ ఫిలిం సిటీకి వెళ్లానని, ఆయనతో పాటు ‘మూడు రాజులు’ హోటల్ సీతారాలో ఉన్నానని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

తాను  చెప్పిన (వ్రాసిన) “హిరణ్యరాజ్యం” నుండి హీరోయిన్ పాత్రను, పాపాగ్ని కథల్లో నుండి “మొండికత్తి” ని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అంతకుముందు త్రివిక్రమ్ ఏమి కథ సిద్ధం చేసుకున్నారో తనకు తెలియదని, కానీ    తాను వ్రాసిన పరిశోధనాత్మక వ్యాసాలనుండి కొన్ని పాత్రలను సృష్టించి, కథను అల్లుకోవడంతో పాటు కథనాన్ని నడిపారని ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అనేకం తన నుండితీసుకున్నా తన పేరు ఎక్కడా ప్రస్తావించలేదని కూడా గంగాధర్ ఆ పోస్టులలో మండిపడ్డారు.         

 

ఇకపోతే త్రివిక్రమ్ సినీ పరిశ్రమలో దిగజారిన తనప్రతిష్ట పెంచుకోవడం,  హిట్ సాధించి సొమ్ముల దండుకోవాలన్న కక్కుర్తితో తాను దిగజారి, “ఒక ప్రాంతాన్ని, ఒక కులాన్నిదిగజార్చి చూపించిన విధానం” అత్యంత హేయమైనదని కళాసాగర్ రెడ్డి మరో పోస్టులో మండిపడ్డారు. ఆయన లాంటి ఎంతోమంది సామాజిక మాధ్యమాలు వేదికగా “అరవింద సమేత త్రివిక్రమ్ పైన” నిప్పులు కురిపిస్తున్నారు.  

ఐదు రూపాయలకు చంపడం, అందుకోసం ఫ్యాక్షన్ నడపడం, ఒకరిని చంపినందుకు కసి తీర్చుకోవడం కోసం హీరో వీర రాఘవ రెడ్డి 60 మంది కొంపల్లో దీపాలార్పడం, ఆ తర్వాత “కళింగ యుద్ధంలో చనిపోయిన సైనికులను చూసి పరివర్తన చెందిన అశోక చక్రవర్తి లా” మన హీరో కూడా పరివర్తన చెంది శాంతి దూతగా మారిపోవడం అంతటా త్రివిక్రమ్ మంత్రజాలమే అంటున్నారు జనం.

ఫ్యాక్షన్ ఎందుకు పుట్టిందో, దాని ప్రభావం ఎంతవుందో , రాయలసీమలో ప్రస్తుతం ఏమి జరుగుతుందో వీరికి తెలియదు. , తెలుసుకోవాలనే  ప్రయత్నం కూడా చేయరు. తాము (తమ ఊహాలోకంలో) అన్వయించుకున్న రీతిలో రాయలసీమ ఉందని, తాము ఏమి చేసినా రాజకీయ నాయకులు(తమ భజన పనులతో బిజీగా ఉన్న)  అడగరని, అమాయకులైన ప్రజలు పట్టించుకోరనే ధీమాతో తమ ఇష్టం మేరకు సినిమాలు తీయడము మానుకోవాలని ఇపుడిపుడే నోర్లు విప్పుతున్న ఉద్యమకారులు కోరుతున్నారు.   సొమ్ముచేసుకోవడమే కాదు ఇతర ప్రాంతాల గౌరవం కాపాడటంతో పాటు, వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని వారు సినీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ ప్రాంతంపై జరుగుతున్న ఈ దాడికి అడ్డుకట్ట వేయడానికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని వీరు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న సీమ వీరులను ఆదుకోవాలని వారు నాయకులకు విజ్ఞప్తి చేశారు.   

ఇకనైనా కాలగర్భంలో కలసిపోయిన ఫ్యాక్షన్ పేరుతొ సినిమాలు తీయడం మానుకుంటారా? లేక ఈ ప్రాంత వాసుల ఆగ్రహాన్ని చవిచూస్తారా? వేచి చూద్దాం.