Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే ప్రేక్షకులలో పెద్ద ఎత్తున అంచనాలు ఉంటాయి. అయితే ఈయన ఇటీవల మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు దీంతో అదే కథతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అవ్వడానికి కొంత సమయం పడుతున్న నేపథ్యంలో ఈయన మరో హీరో వెంకటేష్ తో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా వెంకటేష్ కు తన కెరియర్ 77 వ సినిమా కావటం విశేషం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘వెంకట రమణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. టైటిల్‌కు “కేర్ ఆఫ్ ఆనంద నిలయం” అనే ట్యాగ్‌లైన్ పెట్టనున్నారట. త్రివిక్రమ్ సినిమాల్లో తరచుగా కనిపించే “ఇంటి సెంటిమెంట్” ఇందులోనూ ప్రధానంగా ఉండబోతోందని తెలుస్తుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం, గుంటూరుకారం వంటి సినిమాలు ఇంటి సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో మరోసారి వెంకటేష్ సినిమా విషయంలో కూడా తన సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా త్రిష నటించిన బోతున్నట్టు సమాచారం. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.