సినిమాల్లో ఆయన వేరే వారి భూమలు కబ్జాలు చేసి ఉండవచ్చు. మోసాలు చేసి ఉండవచ్చు. కానీ నిజ జీవితంలో ఆయనే ఓ రియల్ ఎస్టేట్ వాళ్ల చేతుల్లో మోసపోయారు. తెలుగు సినిమాల్లో విలన్ గా చేస్తున్న భోజ్‌పురి హీరో, ‘రేసుగుర్రం’ఫేం రవికిషన్ మోసపోయారు. తనని ముంబైకి చెందిన రియల్టీ సంస్థ కమలా ల్యాండ్ గ్రూప్ మోసగించిందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబై జుహులో ఫ్లాట్ నిర్మిస్తామని చెప్పడంతో తాను కోటిన్నర రూపాయలు చెల్లించానని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు సదరు రియల్టీ గ్రూపు డైరెక్టర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రవికిషన్ తో పాటు మరో బిజినెస్ మ్యాన్ కూడా మోసపోయారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఆ రియల్ ఎస్టేట్ గ్రూప్ ..కమలా ల్యాండ్ గ్రూప్ మమ్మల్ని ఇద్దరినీ మోసం చేసింది. నన్ను నమ్మి రవికిషన్ కూడా మోసపోయాడు. రెండు ఫ్లాట్ల కోసం వాళ్లు నా దగ్గర నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. రవి నుంచి కూడా కోటిన్నర రూపాయలు వసూలు చేసి, సిద్ధాంత్ ప్రాజెక్టులో 3165 చదరపు మీటర్ల ఫ్లాట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి అలాట్‌మెంట్ లెటర్ కూడా ఇచ్చారు.
కానీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదు. అందుకే ఇద్దరం కలిసి పోలీసులకు కంప్లైంట్ చేశాం అని ఆ వ్యాపారి సునీల్ నాయర్ అన్నారు. కాగా వీరిద్దరి ఫిర్యాదు మేరకు జితేంద్ర, జనేంద్ర, కేతన్‌లపై చీటింగ్, బ్రీచింగ్ కేసు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ ఆఫీసర్ ఒకరు తెలిపారు.