టాలీవుడ్ ఒక్క‌టిగా ఉండ‌డం అసాధ్యం

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లు ఒక్క‌టి అవ్వ‌డం కుద‌ర‌ని ప‌నా? ప‌రిశ్ర‌మ‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం అన్న‌ది ఏనాటికీ కుద‌ర‌నిదా? అంటే అవున‌నే బాంబ్ పేల్చాడు ఆర్జీవీ. గ‌త కొంత‌కాలంగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. చిరంజీవి పెద్ద‌రికం న‌చ్చ‌ని బాల‌య్య నేరుగా క‌య్యానికి కాలు దువ్వ‌డం ఈ ఎపిసోడ్ లో నాగ‌బాబు ఇన్వాల్వ్ అవ్వ‌డంతో పెద్ద ర‌చ్చ‌య్యింది. మెగా నంద‌మూరి అభిమానుల మధ్య కొట్లాట‌కు దారి తీసింది. సోష‌ల్ మీడియాలో దూష‌ణ‌ల ఫ‌ర్వానికి అంతూ ద‌రీ లేదు.

అదంతా స‌రే కానీ.. ఇండ‌స్ట్రీని ఒక్క‌తాటిపైకి తెచ్చి న‌డిపించాల‌ని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌వా? అన్న సందేహాన్ని రాజేస్తూ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సైలెంట్ సైటైర్స్ వేడెక్కించాయి.

ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికి వారే. వేటి క‌వే.. ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు మాత్ర‌మేన‌ని అన్నారు. ఎవ‌రి దుకాణం వారిదే అన్న‌ట్టుగా మాట్లాడారు. అంద‌రూ క‌లిసిపోవ‌డం కుద‌ర‌ద‌ని అన్నారు. వ‌ర్మ అన్న‌దానిని బ‌ట్టి ఇండ‌స్ట్రీలో వ‌ర్గ పోరాటాల‌కు అంతూ ద‌రీ ఉండ‌ద‌ని ఎవ‌రూ ఎవ‌రి మాటా విన‌ర‌ని అర్థం చేసుకోవాల్సి వ‌స్తోంది. ఇక ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి దాస‌రి త‌ర్వాత పెద్ద‌న్న పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లూరుతుంటే ప‌రిణామాలు మాత్రం అందుకు పూర్తి వ్య‌తిరేకంగా మారిపోతున్నాయి. ఓవైపు బాల‌కృష్ణ మ‌రోవైపు రాజ‌శేఖ‌ర్ వ్య‌తిరేకంగానే ఉన్నారు. మంచు మోహ‌న్ బాబు ఇటీవ‌ల చిరుతో ఆప్యాయంగా క‌లిసిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నా కానీ సందేహ‌మేన‌నేది మెగాభిమానుల ఇన్ సైడ్ టాక్. మ‌రి ఇలాంట‌ప్పుడు టాలీవుడ్ భ‌విష్యత్ ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయి? అన్న‌దానిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.