“బాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందేన”ని అంటోంది హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్. పలువురు దక్షిణాది కథానాయికల లక్ష్యం బాలీవుడ్. హిందీ లో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ తో పాటు కెరీర్ మరింత ఉజ్వలంగా ఉంటుందని భావిస్తారు. అయితే బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవడం అంత సులభం కాదని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. దక్షిణాదిలో స్టార్ గా ఉన్నప్పటికీ సినిమా అవకాశాల విషయంలో బాలీవుడ్ లెక్కలు వేరేగా ఉంటాయని చెప్పింది.
‘దక్షిణాది కథానాయిక స్టార్‌డమ్ గురించి బాలీవుడ్ పరిశ్రమలో పెద్దగా పట్టించుకోరు. ఈ విషయంలో ఎవరినీ నిందించలేం. నాకు భోజ్‌పురి, బెంగాలీ నటులు అంతగా తెలియదు. అంత మాత్రాన వారికి పేరుప్రతిష్టలు లేవనికాదు. అలాగే బాలీవుడ్ లో నా గురించి తెలిసి ఉండాలని కోరుకోవడం కూడా తప్పే. దక్షిణాదిలో నేను 20 సినిమాలు చేశానని చెప్పుకుంటేనే.. అక్కడి వాళ్లు తెలుసుకుంటారు.
హిందీలో సక్సెస్ కావాలంటే కెరీర్‌ను తిరిగి మొదటి మెట్టు నుంచి ప్రారంభించాల్సిందే’ అని చెప్పింది రకుల్ . ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఓ దగ్గర ఉండాలి కదా.. మరి ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు మకాం మార్చిందట.