రాక్షసుడు ఫిలింనగర్ టాక్ .. ఈసారైనా హిట్టొస్తుందా?
వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. అతడు నటించిన తాజా సినిమా `రాక్షసుడు`. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించగా హీరో హవీష్- కోనేరు సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించారు. తమిళ బ్లాక్ బస్టర్ `రచ్చాసన్`కి రీమేక్ ఇది. అక్కడ హిట్టయిన సినిమాని తెలుగులో ఎలా తీశారు? అంటూ గత కొంతకాలంగా ఫిలింనగర్ లో ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ టీమ్ పై ఒక రకంగా తీవ్ర ఒత్తిడి నెలకొందనే చెప్పాలి. ట్రైలర్ తో మెప్పించారు. కానీ సినిమాలో అంత మ్యాటర్ ఉందా? అసలు .. ఫిలింనగర్ టాక్ ఎలా ఉంది? అన్నది తెలియాలంటే ఇది చదవాల్సిందే.
ఈ సినిమా గ్రిప్పింగ్ థ్రిల్లర్. ప్రథమార్థం ఫర్వాలేదనిపిస్తే .. ద్వితీయార్థం మరికాస్త బెటర్ గానే ఉంటుందని తెలుస్తోంది. క్లైమాక్స్ అర్థగంట సేపు కళ్లు తిప్పనివ్వదు. ప్రతి నిమిషం ఉత్కంఠకు గురి చేస్తుందట. అయితే తెలుగు మసాలా ఆడియెన్ కి కావాల్సిన కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో తక్కువే. ఒక కథగా చూస్తే మంచి సినిమా అన్న మాట వినిపిస్తోంది. అయితే సినిమాల ఫేట్ ని నిర్ణయించేది కేవలం మంచి కంటెంట్ ఒక్కటే కాదు. మంచి రిలీజ్ తో పాటు ఇంకా చాలా కారణాలే ఉంటాయి. ఈసారైనా యువహీరో బెల్లంకొండకు కలిసొస్తుందా లేదా? అన్నది చూడాలి. రాక్షసుడు చిత్రంతో హిట్టు కొట్టి తీరాలన్న పంతంతో నటించాడు. ఈ సినిమా విజయంపై అనుపమ.. రమేష్ వర్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఫలితం ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఈ శుక్రవారం (ఆగస్టు 2) రాక్షసుడు ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.