లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది శృతిహాసన్. తెలుగు,తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పడే ప్రేమలో పడి సినిమాలకు దూరం అయింది.
ఇక శృతి హాసన్ వెండితెర మీద కనిపించి చాలాకాలం అయింది. పవన్ కల్యాణ్‌తో కలిసి కటమరాయుడు సినిమాలో కనిపించింది. ఆ సినిమా తరువాత ఇప్పటి వరకు మరో సినిమాలో నటించలేదు. అయితే తాజాగా ఆమె పేరు మరోసారి మీడియాలో హైలెట్ అయ్యింది. శృతిహాసన్ ను నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.
ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఏడిపించారని, మహేష్ బాబును తప్ప ప్రతి హీరోను ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఒక్క మహేష్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని అన్నారు. డైరెక్టర్లను కూడా ఏడిపించారని విమర్శించారు. లీగల్ నోటీసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి, డేట్లను తీసుకునేవారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టిందని చెప్పారు.
అంతేకాకుండా పీవీపీ ఒక క్రిమినల్, ఒక మోసగాడు అంటూ కేశినేని నాని విమర్శించారు. చిన్నప్పటి నుంచే నేరగాడని అన్నారు. కెనరాబ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేళం వేస్తే, కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదని చెప్పారు.
జగతి పబ్లికేషన్ లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని అన్నారు. సెబీ కూడా రూ. 30 కోట్ల ఫైన్ వేసిందని చెప్పారు. విజయవాడ లోక్ సభ ఎన్నికల బరిలో టీడీపీ నుంచి కేశినేని, వైసీపీ నుంచి పీవీపీ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.