రివ్యూ రైటర్లపై పూరీకి ఎందుకీ అసహ్యం?
సినీ సమీక్షకులపై ఫిలింమేకర్ అభిప్రాయం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. రిలీజైన కొన్ని నిమిషాల్లోనే సినిమాలపై సామాజిక మాధ్యమాల్లో సమీక్షలు పోటెత్తుతున్నాయి. వెబ్ సైట్లు.. యూట్యూబ్ రివ్యూలు అంటూ నానా రచ్చ భయపెట్టేస్తోంది. యావరేజ్… బిలో యావరేజ్.. హిట్.. ఫ్లాప్ అనే కామెంట్లు చేస్తూ వాటికి రేటింగులు ఇస్తుంటే ఆడాల్సిన సినిమాపైనా తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయం మేకర్స్ లో ఉంది. ఏడాది శ్రమ కేవలం క్షణాలు.. నిమిషాల్లోనే వృధా అయిపోతోంది. అందుకే రివ్యూ రైటర్లు అంటే ప్రతి ఒక్కరిలో అంతో ఇంతో భయం.. మంట!
ఇక ఆర్జీవీ.. పూరి కాంపౌండ్ సినిమాలంటే రివ్యూ రైటర్లకు మరీ లోకువ. ఇటీవలి కాలంలో ఆ ఇద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే ప్రత్యేకించి రివ్యూ రైటర్లు చెలరేగి విమర్శిస్తున్నారు. క్రిటిక్స్ తమను టార్గెట్ చేసి నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారన్న భావనా ఉంది. అయితే కంటెంట్ లేని సినిమాలు తీసి ఆ ఇద్దరూ ప్రతిసారీ దొరికిపోతున్నారు. బాలేని సినిమాని బాలేదు అన్నా ఇబ్బంది పడుతున్నారు. నేడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదలైంది. ఎనర్జిటిక్ రామ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. టీజర్.. ట్రైలర్ మాస్ ని ఆకట్టుకున్నా కొన్ని విమర్శలు.. వివాదాలు యథావిధిగా తప్పలేదు.
అయితే ఈసారి మాత్రం ఎందుకనో పూరి చాలా భయపడినట్టే కనిపిస్తోంది. ప్రతిసారీ తన సినిమాలు రిలీజవ్వడం.. వాటిపై క్షణాల్లోనే సోషల్ మీడియా .. వెబ్ లో నెగెటివ్ రివ్యూలు చదవాల్సి రావడం అతడిలో ఓకింత ఆందోళనకు కారణమైందని అర్థమవుతోంది. `మెహబూబా` అనుభవాన్ని పూరి ఇంకా మర్చిపోలేదనే అర్థమవుతోంది. అందుకే నేడు హైదరాబాద్ క్రిటిక్స్ కి ప్రివ్యూ షోని క్యాన్సిల్ చేశారు. ఏ చిన్న సినిమా రిలీజైనా మీడియాకి తప్పనిసరిగా ప్రివ్యూ వేసి సమీక్షలు అడుగుతుంటారు. అలాంటిది పూరి ఏకంగా మీడియా షోనే బహిష్కరించడంపై ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారంతా. ఇదంతా రివ్యూ రైటర్లకు భయపడి చేసినదేనా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది పూరీనే చెబుతారేమో చూడాలి.