విలక్షణ నటుడిగా తెలుగు,తమిళ, మళయాళ , కన్నడ సినిమాల్లో పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు ప్రకాశ్ రాజ్. ఆయన తాజాగా రాజకీయాల్లోనూ సత్తా చాటడానికి ముందుకొచ్చారు. బెంగళూరు సెంట్రల్ అభ్యర్థిగా లోక్ సభ బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. !
ఈ నేపధ్యంలో ప్రకాశ్ రాజ్ తన నామినేషన్ తో పాటు ప్రకటించిన అఫిడవిట్ లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తన వద్ద మొత్తం రూ. 26.59 కోట్ల విలువైన స్థిరాస్థులు, రూ. 4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు.
2018లో సినిమాల్లో నటించడం ద్వారా రూ. 2.40 కోట్ల ఆదాయాన్ని పొందానని, వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లో రూ. 25 వేల నగదు, రూ. 2.94 కోట్ల పెట్టుబడులు, రూ. 1.88 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయని అన్నారు.
ఇక ఆయన భార్య రష్మీ వర్మ పేరిట రూ. 20.46 లక్షల చరాస్థి, రూ. 35 లక్షల విలువైన స్థిరాస్తులతో పాటు రూ. 18 లక్షల విలువైన బంగారం తదితర విలువైన ఆభరణాలున్నాయని వెల్లడించారు. శాంతికి భంగం కలిగించారన్న ఆరోపణపై చిక్ మగుళూరులో తనపై ఓ కేసు నమోదైందని ఆయన పేర్కొన్నారు.