ప్రభాస్,షర్మిల రూమర్..ఆ 10 వెబ్ సైట్లపై చర్యలు

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ తన పై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై చర్య తీసుకోవాల్సిందా కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో షర్మిల, ప్రభాస్‌లపై అసభ్యకరమైన వార్తలు రాసిన 10 వెబ్‌సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవటానికి రంగం సిద్దం చేసారు.

అంతకాకుండా షర్మిల ఈ విషయమై …గూగుల్, యూట్యూబ్‌కు ఆమె ప్రత్యేకంగా లేఖ కూడా రాసారు. దాంతో హైదరాబాద్ సైబర్ క్రైం విభాగం దర్యాప్తు చేపట్టింది. వారి దర్యాప్తులో యూట్యూబ్, ఫేస్‌బుక్‌తో పాటు మొత్తం 10 వెబ్‌సైట్లను గుర్తించినట్లు సైబర్ క్రైం డీసీపీ తెలిపారు.

అలాగే ఈ కేసును రాజకీయ, వ్యక్తిగత కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, 2 వారాల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇక వెబ్ సైట్లలో ఈ రూమర్స్ రాసిన వారితో పాటు అందుకు ప్రొత్సహించిన వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇక వైఎస్‌ షర్మిళ మీడియాతో మాట్లాడుతూ..‘నాకూ, ప్రభాస్‌కు సంబంధం ఉందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. నా జీవితంలో ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. 2014 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారాలే చేశారు. అప్పుడు పోలీసులు చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఆగింది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ ఈ దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. దీని వెనుక తెదేపా హస్తం ఉంది’ అని షర్మిల ఆరోపించారు.

అలాగే వీరి ఉద్దేశం ఒక్కటే నా వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారిమీద, వారి వెనకున్న వారి మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కలిశాము. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించడం లేదు. ఇలాంటి రాతలు ఇంకా ఎంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత పైశాచికంగా, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని, మన సమాజం ఆమోదించవచ్చా ?

ఇది ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీకూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మాట్లాడకపోతే ఇదే నిజం అని కొంతమంది అయినా అనుకునే అవకాశం ఉంది. ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశాము.

ఏ హీరోతో అయితే సంబంధం​ ఉందని తప్పడు ప్రచారం చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఇదే నిజమని నాపిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. తప్పడు ప్రచారాలు చేస్తున్న వారు మీరు ప్రచారం చేస్తున్నదే నిజం అని, నాలా ప్రమాణం చేయగలరా. లేదా రుజువులు, ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని కించపరచడం దారుణం, దుర్మార్గం కాదా.

నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులు అందరిని బాధపెట్టే విషయం ఇది. ఇలా పుకార్లు పుట్టించిన వారికి, వారి వెనక ఉన్న వారికి సిగ్గనిపంచడం లేదా? అని ప్రశ్నించారు.