ఏం చేసినా డార్లింగ్ స్టైల్లో ఉండాలి
టిప్పర్ లారీ ఎళ్లి స్కూటర్ ని గుద్దేస్తే ఏటవుతాది? ఈ ప్రశ్న బుజ్జిగాడు ప్రభాస్ నే అడగాలి. భారతదేశంలోనే `నెవ్వర్ బిఫోర్` అన్న పదానికి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి ముందు బాహుబలి తర్వాత అన్న తీరుగా ఇండియన్ సినిమా హిస్టరీని చూడాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు ఖాన్ లు అని చెప్పుకునే వాళ్లే ఇప్పుడు డార్లింగ్ అంటూ కలవరిస్తున్నారు. ముంబై మీడియా సైతం అతడికి సాహో అంటూ సలాం చేస్తోంది. ఆ స్థాయిని సౌత్ సినిమాకి టాలీవుడ్ సినిమాకి తెచ్చిన తొలి హీరోగా డార్లింగ్ ప్రభాస్ రికార్డులకెక్కాడు. అయితే తన స్నేహితుడైన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వల్లనే ఇదంతా పాజిబుల్ అన్న సంగతిని అతడు ఎప్పటికీ మరవడు. డార్లింగ్ లో ఇప్పటికీ అదే వినయం విధేయత.
అన్నట్టు ఇండియన్ సినిమా హిస్టరీలో బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ బ్రేక్ చేసిన `బాహుబలి` తర్వాత .. నెవ్వర్ బిఫోర్ అని చెప్పదగ్గ.. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాతో వరల్డ్ వైడ్ ప్రేక్షకాభిమానుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్స్ జామ్ అయిపోయిన సంగతి తెలిసిందే. సాహో తొలి రోజు 100 కోట్లు పైగానే వసూలు చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడితోనే మజాక్ అయిపోలేదు. ముందుంది ముసళ్ల పండగ అనేస్తున్నాడు డార్లింగ్.
నువ్వు చాలా స్పెషల్ డార్లింగ్
సాహో తర్వాత అతడు నటించే సినిమా కూడా ఆ లెవల్లోనే ఉంటుందన్నది డార్లింగ్ ఇచ్చిన హింట్. ఈసారి మూవీ లవ్ స్టోరీ చేస్తున్నా. ఇండియాలో నెవ్వర్ బిఫోర్ లవ్ స్టోరి ఇదని ప్రభాస్ చెబుతున్నారు. 1960 ల నాటి యూరప్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన ప్రేమ కథ ఇది. ఇంత వరకు ఇలాంటి ప్రేమకథా చిత్రాన్ని భారత చిత్రాలలో చూసి ఉండరు అని ప్రశంసలు అందుకునేంత కొత్తగా ఉంటుందనే ఆసక్తికర రహస్యాన్ని అభిమానుల కోసం బయటపెట్టారు. దీనితో ప్రభాస్ నటించే తదుపరి చిత్రం పీరియాడిక్ లవ్ స్టోరీ అన్న క్లారిటీ వచ్చేసింది. అది కూడా నెవ్వర్ బిఫోర్ ప్రయత్నమే. అయితే ఈ చిత్రానికి 300 కోట్ల రేంజు పెట్టుబడి లేకపోయినా 100-120 కోట్లు మాత్రం ఉంటుందని మరో హింట్ ఇచ్చారు ప్రభాస్. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. అంటే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు సరిపడే స్టఫ్ ఉన్న యూనివర్శల్ అప్పియరెన్స్ ఉన్న చిత్రం అని చెప్పకనే చెప్పాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 20రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. 2020లో ఈ చిత్రం విడుదల కానుంది.