సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. హైదరాబాద్ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.
రాయదుర్గం పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు వెలువరించింది. ఇక్కడ గతంలోనే పశువుల పాకలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. సమీపంలోనే ప్రభాస్ గెస్ట్‌హౌస్ ఉంది.
ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభాస్ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్ చెప్పారు.