‘బాహుబలి’ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు తన గెస్ట్ హౌస్ ని సీజ్ చేయడంపై హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీర్పుపై ప్రభాస్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారణకు రానుంది.
కేసు వివరాల్లోకి వెళితే..
ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు.
రాయదుర్గంలోని పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో గల 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
ఆ స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉండటంతో దాన్నీ సీజ్ చేశారు. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు.
ఇక ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందుతుందని మాల రాములు, నీరుడు లక్ష్మయ్య కోర్టును ఆశ్రయించారు. వీరి నుంచి కొంత భూమి కొనుగోలు చేసిన శివరామకృష్ణ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లారు. వీరి వాదనలు విన్న న్యాయస్థానం బాధితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
భూమిని ఫిర్యాదుదారుల పేరుపై పట్టా చేయాలని అధికారులను ఆదేశించింది. కానీ అప్పటి తహసీల్దార్ పట్టా చేయకపోవడంతో శివరామకృష్ణ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. దీంతో తహసీల్దార్‌కు కోర్టు ధిక్కారణ శిక్ష విధించింది. ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు కేసు కొట్టేసింది. దీంతో ఆ స్థలంలో ఉన్న భవంతులను అధికారులు సీజ్ చేశారు. అక్కడే ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉంది.