అల్లు రామాయణంలో ప్రభాస్, ఎన్టీఆర్?
రామాయణం, మహాభారతం వంటి పురాణేతిహాసాల్ని వెండి తెరపై చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అలాంటి కథాంశాల్ని ఎంచుకుంటే అవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావాలి. కాన్వాసుకు తగ్గట్టే అత్యంత భారీ బడ్జెట్లను కుమ్మరించాల్సి ఉంటుంది. దీంతో పాటే స్టార్ల కాల్షీట్లు పెద్ద సమస్య. అన్నిటినీ అధిగమించి షూటింగ్ కి వెళ్లేప్పటికే చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ఇలాంటి భారీ ప్రాజెక్టులకు మధ్యలోనే వివాదాలు ఎదురైతే వచ్చే ముప్పు మామూలుగా ఉండదు. అందుకే మహాభారతం సిరీస్ ని తెరకెక్కించే ప్రయత్నం చేసినా అమీర్ ఖాన్ అంతటివాడే చప్పున చల్లబడిపోయాడు. రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 1000 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు ముందుకొచ్చినా మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ సాహసం చేయలేకపోయారు.
అయితే అమీర్ ఫెయిలైనా ఈసారి బాస్ అల్లు అరవింద్ ఫెయిలవ్వకూడదని నిర్ణయించుకున్నట్టే కనిపిస్తోంది. మొన్ననే అల్లు వారి `రామాయణం` అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అప్పట్లో ప్రకటించి వదిలేశారులే అనుకుంటే సడెన్ గా తెరపైకి తేవడంతో ఈ ప్రాజెక్టుపై ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. బాలీవుడ్- టాలీవుడ్ సహా దక్షిణాది స్టార్లను కలుపుకుని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు దాదాపు 500 కోట్లు వెచ్చించాలని అరవింద్ ప్లాన్ చేస్తున్నారన్న సమాచారం ఉంది. అయితే `రామాయణం`లో స్టార్ కాస్టింగ్ ఎవరు? అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. రాముడు ఎవరు? రావణుడు ఎవరు? ఇతర పాత్రలకు ఎవరిని ఎంపిక చేస్తారు? అంటూ రకరకాల ఊహాగానాలు సాగిస్తున్నారు.
రాముడి పాత్రకు బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ అయితే బావుంటుందని అరవింద్ టీమ్ భావిస్తోందట. జోదా అక్భర్, మొహంజోదారో లాంటి భారీ చిత్రాల్లో నటించాడు హృతిక్. తీరైన రూపంతో రాముడి పాత్రకు అతడు సూటవుతాడని భావిస్తున్నారట. అయితే హృతిక్ కి ఉన్న ఇతర కమిట్‌మెంట్లు అంతే భారీగా ఉన్నాయి. అందువల్ల గంపగుత్తగా కాల్షీట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తాడా లేదా? అన్నది బిగ్ టాస్క్. మరోవైపు హృతిక్ అంగీకరించకపోతే వేరొక ఆప్షన్ ని అనుకున్నారట. రాముడి పాత్రకు హృతిక్ కాకపోతే ప్రభాస్ అయితే బావుంటుందని కూడా అరవింద్ మైండ్ లో ఉందట. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్. బాహుబలి తర్వాత `సాహో` పాన్ ఇండియా సినిమానే కాబట్టి. అతడిని ఖాయం చేయగలిగితే ప్రాజెక్టుకి హైప్ వచ్చినట్టే. ఒకవేళ ప్రభాస్ రాముడు అయితే రావణుడు ఎవరై ఉండాలి? అతడికి ధీటుగా నటించి మెప్పించే వేరొక స్టార్ కావాలి కాబట్టి ఆ పాత్రకు యంగ్ యమ ఎన్టీఆర్ అయితే బావుంటుందని భావిస్తున్నారట. ఎన్టీఆర్ ఇదివరకూ `జై లవకుశ`లో రావణ పాత్రను చించి ఆరేశారు. అతడే రావణుడు అయితే అదిరిపోతుందని అరవింద్ బృందం భావిస్తోందట. అయితే వీళ్లు ఫైనల్ అని భావించాక ప్రభాస్, ఎన్టీఆర్ లను సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఇవన్నీ స్పెక్యులేషన్స్ గానే భావించాలి. ఒకసారి కాస్టింగ్ ని ఫైనల్ చేసి ప్రొడక్షన్ హౌస్ అధికారికంగా ప్రకటించాకే ఇది నిజం అని నమ్మగలం. ఇక రామాయణం అంటే లక్ష్మణుడు, ఆంజనేయుడు, వాలి, సుగ్రీవుడు, శూర్పణఖ ఇలా క్రేజీగా చాలానే పాత్రలు ఉంటాయి. వీటన్నిటికీ స్టార్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అల్లు వారి రామాయణం ఎంతవరకూ ముందుకెళుతుందో చూడాలి.