పోలీస్ పాత్రలో అజిత్

‘నేర్‌కొండ పార్వై’ సినిమాతో మహిళా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు అజిత్‌. మళ్లీ ఆయన ఈ చిత్ర దర్శకుడై వినోద్‌ తెరకెక్కించే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది అజిత్‌కు 60వ సినిమా కావడం మరింత విశేషం. ఇందులో అజిత్‌ కారు రేసర్‌గా నటిస్తున్నట్లు ఆరంభంలో ప్రకటించారు. పోలీసు అధికారిగా కూడా కనిపిస్తారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగా శరీరాన్ని ఫిట్‌గా మార్చుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల అజిత్‌కు సంబంధించిన న్యూలుక్‌ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో అజిత్‌ నలుపు జుట్టుతో కనిపించడంతోపాటు బాగా బరువు తగ్గినట్లు ఉన్నారు. పోలీసు పాత్ర కోసమే ఆయన ఇలా తగ్గారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘ఆంజనేయ’, ‘మంగాత్తా’, ‘ఎన్నై అరిందాల్‌’ చిత్రాల్లో పోలీసుగా నటించారు అజిత్‌. ఇప్పుడు మళ్లీ ఖాకీ దుస్తులతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో సాల్ట్‌ పెప్పర్‌ లుక్‌లో కనిపించరని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.