పీట‌ర్ హెయిన్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా?

ఫైట్ మాస్ట‌ర్ తో యాక్ష‌న్ సినిమానా?

సౌత్ సినీప‌రిశ్ర‌మ‌లో ద‌శాబ్ధం పైగానే కెరీర్ ని సాగించారు పీట‌ర్ హెయిన్. ఆ పేరు విన‌గానే 2009 బ్లాక్‌బ‌స్ట‌ర్ మ‌గ‌ధీర గుర్తుకు రావాల్సిందే. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఈ సినిమా కోసం చెర్రీతో పీట‌ర్ హెయిన్స్ భారీ సాహ‌సాలే చేయించారు. అలాగే ఆయ‌న కూడా సెట్స్ లో ఓ స్టంట్ సీన్ లో ప్ర‌మాదానికి గురై గాయ‌ప‌డ్డారు. ఆ త‌ర్వాతా టాలీవుడ్ లో అత‌డు ఎన్నో సినిమాల‌కు ఫైట్స్ ని కొరియోగ్రాఫ్ చేశారు. రాజ‌మౌళి,శంక‌ర్, మురుగ‌దాస్ వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేశారు. మురారి,శివాజీ, అప‌రిచితుడు, రోబో, ఛ‌త్ర‌ప‌తి, అత‌డు, గ‌జినీ (హిందీ), సెవెంత్ సెన్స్.. చిత్రాల‌కు పీట‌ర్ అందించిన ఫైట్స్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది.

సౌత్ – నార్త్ లో ది బెస్ట్ అన‌ద‌గ్గ చిత్రాల‌కు అత‌డు స్టంట్స్ కొరియోగ్ర‌ఫీ చేశారు. అయితే ఇన్నేళ్ల‌లో ఆయన క‌ళ్ల ముందు ఎంద‌రో ఫైట్ మాస్ట‌ర్లు ద‌ర్శ‌కుల‌య్యే ప్ర‌య‌త్నం చేసినా తాను మాత్రం ఎంచుకున్న వృత్తిలోనే కొన‌సాగారు. ఇన్నాళ్ల‌కు ఆయ‌న రూటు మారుతోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పీట‌ర్ హెయిన్ ద‌ర్శ‌కుడ‌వుతున్నారు. టాలీవుడ్ నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి అత‌డిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ లో ఓ భారీ చిత్రానికి నిర్మించ‌నున్నారు. ద‌స‌రాకి సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ల‌క్ష్యం-కాంచ‌న‌, రేసుగుర్రం, ర‌భ‌స‌, ముకుంద‌, ట‌చ్ చేసి చూడు లాంటి భారీ చిత్రాల్ని బుజ్జి నిర్మించారు. బెల్లంకొండ సురేష్‌, ఠాగూర్ మ‌ధు, వ‌ల్ల‌భ‌నేని వంశీ వంటి నిర్మాత‌ల‌తో సంయుక్త నిర్మాణంలో ఆయ‌న ప‌లు చిత్రాల్ని నిర్మించారు. పీట‌ర్ హెయిన్ తో ఏ త‌ర‌హా సినిమాని ప్లాన్ చేస్తున్నారన్న‌ది ఆస‌క్తిక‌రం.

పీట‌ర్ హెయిన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అంటే.. హాలీవుడ్ స్థాయి యాక్ష‌న్ సినిమాని అభిమానులు ఆశిస్తారు. ఇండియాస్ బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ తో సినిమా అంటే కంటెంట్ ఏమాత్రం త‌గ్గినా కుద‌ర‌దు. అంచ‌నాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో భారీ మాస్ యాక్ష‌న్ చిత్రాన్ని తీస్తారా? లేక బాక్సింగ్ .. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో సినిమానా? అన్న ఆస‌క్తి ఉంటుంది.