ప్రయోగాలతో సెన్సేషన్స్ అతడికి అలవాటు. ఒకసారి సముద్రంలో సినిమా అంటాడు. ఇంకోసారి అంతరిక్షం అంటాడు. ఈసారి ఏకంగా గణిత శాస్త్రం అంటూ కొత్తగా వెళుతున్నాడు. అసలు ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా కథల్ని ఎంచుకుంటూ అతడు చేస్తున్న ప్రయత్నాలు అతడిలోని సాహసానికి మొండితనానికి సింబాలిక్ అనే చెప్పాలి.
వార్ బ్యాక్ డ్రాప్.. సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి.. ఆ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి ప్రయత్నం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్. ఆ తర్వాత అంతరిక్షం అంటూ స్పేస్ నేపథ్యంలో సినిమాని తీసి మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఈసారి ప్రయత్నం ఫెయిలైనా అతడిలో ప్రయోగాత్మకత మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం వికాస్ బాల్ సూపర్ 30 తరహా ప్రయోగం చేయబోతున్నాడని తెలిసింది. బీహార్ కి చెందిన ఆనంద్ కుమార్ జీవితకథతో తీసిన సూపర్ 30 ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే బీహార్ కి చెందిన వేరొక గణిత శాస్త్రజ్ఞుడి లైఫ్ స్టోరీని సంకల్ప్ ఎంచుకున్నాడట. బీహార్ కి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త వషిష్ట నారాయణ సింగ్ జీవిత కథను తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. వశిష్ట ఎవరు? అంటే.. పురాతన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సాల్వ్ చేసిన మేధావి అని తెలుస్తోంది. అమెరికా మ్యాథమెటీషియన్లకే సాధ్యం కాని ఎన్నో సొల్యూషన్స్ ఇచ్చిన అపారమేధావి అని తెలుస్తోంది. పేదరికం.. భార్య మోసం వంటి కారణాలతో చివరి నాళ్లలో దుర్భర జీవితం అనుభవించాడు. అందుకే ఈ సినిమాలో ఎంతో ఎమోషన్ ఉంటుందని భావిస్తున్నారట. అయితే ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే తీస్తున్నారా.. బాలీవుడ్ టై అప్ తో ఉంటుందా? అన్నది సంకల్ప్ చెప్పాల్సి ఉంటుంది.