ప్రస్తుతం దేశంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. క్రీడారంగం సహా అన్ని రంగాల్లో ప్రముఖుల జీవితకథలతో సినిమాలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్జాయ్ జీవిత చరిత్ర ను సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. చిత్ర దర్శకుడు హెచ్ ఇ అంజాద్ ఖాన్ పై ఫత్వా జారీ అయింది. పాకిస్తాన్ లో బాలికల విద్యపై విస్త్రత ప్రచారం చేస్తున్న మలాలా తాలిబాన్లకు టార్గెట్. ఆమెపై తాలిబాన్లు దాడి చేసి హత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ మలాలా ఆ తర్వాతి కాలంలో బాలికల విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. అతి పిన్న వయసులో నోబుల్ బహుమతి పొందిన మలాలా ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అటువంటి మలాలా జీవితం ఆధారంగా నిర్మిస్తున్న హిందీ చిత్రం గుల్ మకాయ్. ఈ చిత్రం ప్రారంభం అయి నాటి నుంచి దర్శకుడికి హత్య బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి.
అయినా వాటిని ఖాతరు చేయకుండా అతడు చిత్రాన్ని పూర్తి చేశాడు. చిత్రంలో ఒక సన్నివేశం ఉంది. అదేమిటంటే వెనుక బాంబులు పేలుతుంటే మలాలా చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఉంటుంది. ఈ సన్నివేశాన్ని వాల్ పోస్టర్ గా ముద్రించారు. మలాలా చేతిలో ఉన్న పుస్తకం ఖురాన్ అని, ఖురాన్ కు అపచారం చేసినందుకు ఫత్వా జారీ చేస్తున్నానని నోయిడా కు చెందిన ఒక ముస్లిం మత ప్రబోధకుడు ఆయనకు ఫత్వా జారీ చేశారు. అయితే ఆ సన్నివేశంలో మలాలా చేతిలో ఉన్నది ఖురాన్ కాదని, అది ఒక ఇంగ్లీష్ పుస్తకం అని దర్శకుడు చెబుతున్నాడట.