ఓవర్సీస్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనిది. అక్కడ ఒకరోజు బావుంటే ఇంకో రోజు అంత బావుండడం లేదు. అందుకు ఇటీవల సినిమాల బిజినెస్ ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇంతకుముందు బాహుబలి 1, 2 చిత్రాలు రిలీజై ఓవర్సీస్ లో బంపర్ హిట్లు కొట్టాయి. ఆ దెబ్బకు ఆ తర్వాత రిలీజైన చాలా సినిమాలకు అది మార్కెట్ పరంగా కలిసొచ్చింది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా వర్కవుటైంది. తెలుగు సినిమా వీక్షణ పెరగడంతో రంగస్థలం- భరత్ అనే నేను లాంటి చిత్రాలు చక్కని వసూళ్లను దక్కించుకున్నాయి. నాన్ బాహుబలి కేటగిరీలో ఇవి రెండూ 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరాయి. 3 మిలియన్ అంటే 20కోట్లు సుమారు.
అయితే ఈ వసూళ్లకు తగ్గట్టుగానే ఓవర్సీస్ రైట్స్ ని గట్టిగానే అమ్మారు. కానీ ఆ తర్వాత మాత్రం అంత సీన్ కనిపించలేదని తెలుస్తోంది. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ రిలీజైన సాహో ఆశించిన మార్క్ ని అందుకోలేకపోయింది. దీంతో భారీ సినిమాల్ని నమ్మి పెద్ద మొత్తాలు పెట్టేందుకు పంపిణీ వర్గాలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇటీవల సైరా.. అల వైకుంటపురములో ఓవర్సీస్ బిజినెస్ పరిశీలిస్తే ఆ సంగతి అర్థమైపోతుందని అంటున్నారు.
సైరా చిత్రానికి 3 మిలియన్ డాలర్ కలెక్షన్స్ దక్కుతాయని భావించిన కొణిదెల టీమ్ అందుకు తగ్గట్టే రేటును కోట్ చేశారు. ఓవర్సీస్ 18 కోట్లు డిమాండ్ చేశారు. కానీ మార్కెట్లో సరైన స్పందన లేదు. 18 కోట్ల నుంచి అమాంతం ఐదారు కోట్లు తగ్గిస్తామన్నా ఎవరూ కొనకపోవడంతో 10.5కోట్లకు పడిపోయిందిట రేటు. చివరికి అక్కడ డీల్ క్లోజ్ చేశారు. అలాగే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అల వైకుంఠపురములో చిత్రానికి డిమాండ్ అంతే పడిపోయిందని చెబుతున్నారు. 15కోట్ల రేంజు ఉంటుందని భావిస్తే చివరికి రూ.8.5 కోట్లకు డీల్ ముగించారట. ఆ మేరకు హారిక సంస్థ కు ఇది మింగుడు పడలేదని తెలుస్తోంది. భారీ సినిమాలు బ్లాక్ బస్టర్ అన్న టాక్ వస్తేనే రిటర్నులు సాధ్యం. తేడా టాక్ వస్తే అంతే సంగతి. అందుకే ఇలా జాగ్రత్త పడుతున్నారట. అయితే అత్యాశకు పోయి అదనపు డిమాండ్ చేయడం వల్ల కూడా ఓవర్సీస్ ఇలా గందరగోళంలో పడిందన్న మాటా వినిపిస్తోంది. అయితే ఈ ప్రభావం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పై ఉండే ఛాన్స్ లేదని వినిపిస్తోంది. బాహుబలి డైరెక్టర్ గా అతడికి ఆమాత్రం గౌరవం ఉంటుంది. పైగా రామ్ చరణ్ – ఎన్టీఆర్ లాంటి గొప్ప స్టార్ డమ్ ఉంది కాబట్టి బిజినెస్ పరంగా హైప్ ఉంటుందనడంలో సందేహం లేదు.