టిక్కెట్టుపై ఆఫ‌ర్.. జ‌నం థియేట‌ర్ల‌కు వెళ‌తారంటారా?

మహమ్మారి విజృంభ‌న‌తో ప్రపంచ దేశాల‌ ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. టాలీవుడ్ స‌హా అన్ని సినీ పరిశ్రమలు సంక్షోభానికి మినహాయింపు కాదు. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు .. ఎగ్జిబిట‌ర్లు ఈ క‌ల్లోలంలో తీవ్రంగా న‌ష్ట‌పోయారన్న స‌మాచారం ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్.. షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చారు కానీ థియేట‌ర్లు తెరిచేది ఎప్పుడు? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్ లోనే ఉంది. మ‌రి ఈ స‌స్పెన్స్ కి తెర వీడేదెపుడు?

వినోద రంగంలోని అగ్రశ్రేణి ఎగ్జిబిటర్లు త్వరలో ప‌రిస్థితి య‌థాస్థితికి వ‌స్తుంద‌ని వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించవచ్చని అన్ని పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయని ఆశిస్తున్నారు. ఈ సమయంలో థియేటర్ యజమానులు ప్రేక్షకుల భద్రత గురించి ఆలోచించాల్సి ఉంది. ఇక‌పై థియేట‌ర్ల‌లో సీటింగ్ ఏర్పాట్లను ప్రభుత్వంతో ప్లాన్ చేయాల్సి ఉంటుంద‌ని మార్గదర్శకాలు వెలువ‌డ్డాయి.

ప‌రిశ్ర‌మ ఇన్ సైడ్ సోర్సెస్ నుండి వచ్చిన తాజా స‌మాచారం ప్రకారం.. టాప్ మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు కూడా ఆగస్టు మొదటి వారంలో ఓపెన్ కానున్నాయ‌ని స‌మాచారం. మల్టీప్లెక్స్‌లలో వ‌న్‌ ప్ల‌స్ వ‌న్ కాంబో త‌ర‌హా ఆఫర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే ఒక టిక్కెట్టు కొంటే ఒక‌టి ఉచితం అన్న‌మాట‌. దీనివ‌ల్ల ప్రేక్ష‌కులు థియేటర్లకు రావటానికి ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని ఎగ్జిబిట‌ర్లు భావిస్తున్నార‌ట‌. తొలి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లు కూడా టికెట్ ధరలపై ప్రేక్షకులకు 50% తగ్గింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయిట‌. తద్వారా ఈ కష్ట కాలం నుంచి గండం నుంచి గ‌ట్టెక్కాల‌ని భావిస్తున్నార‌ట‌.

మరో వైపు, ఎగ్జిబిటర్లు ఫిలింవ‌ర్గాలు ప్రేక్షకుల బడ్జెట్ల ప‌రిస్థితిపైనా ఆలోచించాలి. వారు మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలి. అలాగే బయటి ఆహారాన్ని అనుమతించాలి. ఉదయం థియేటర్లలో టిక్కెట్ల ధరలను తగ్గిస్తే ఉప‌యోగం ఉంటుంది. ఎందుకంటే ఇది తక్కువ ఆక్యుపెన్సీ కలిగి ఉండేది మోర్నింగ్ షో కాబ‌ట్టి త‌గ్గితేనే మంచిద‌ని విశ్లేషిస్తున్నారు. టిక్కెట్టు పేరుతో మునుపటి రోజుల మాదిరిగా తమ జేబులను దోచుకోలేరనే ప్రేక్ష‌కులు ఇపుడు భావిస్తున్నారు. ఆగ‌స్టు నుంచి మ‌ల్టీప్లెక్సులు.. ఇత‌ర థియేట‌ర్లు తెరుస్తారా లేదా? అన్న‌ది కేంద్రం నిర్ణ‌యించాల్సి ఉంటుంది. భారతదేశంలో పడిపోతున్న ఫిల్మ్ ఎగ్జిబిషన్ వ్యాపారం పునరుజ్జీవనం కోసం భారత ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రావాల‌నే ఆశిద్దాం.