ఇప్పటికే బోరోప్లస్, నవరత్న ఆయిల్, మలబార్ గోల్డ్, సెలెక్ట్ మొబైల్స్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ కు మరో బ్రాండ్ చేతికి వచ్చింది.పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రోడక్ట్ యాపీ ఫిజ్ అడ్వర్టైజింగ్ కోసం ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకుంది.
ఎన్టీఆర్ సౌత్ ఇండియా రీజియన్ మొత్తానికి ప్రచారకర్తగా ఉండబోతున్నాడు. అయితే ఈ ఉత్పత్తికి నార్త్ ఇండియా అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఖాన్ హిందీ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించగా తెలుగులో ఎన్‌టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు. ఈ విధంగా సల్మాన్ ఖాన్‌కు వస్తున్న ఆఫర్లే ఎన్‌టీఆర్‌కు కూడా వస్తుండటం చూస్తే ఎన్‌టీఆర్ క్రేజ్ అర్థం అవుతోంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్యనే అరవింద సమేత తో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 లో రిలీజ్ కానుంది . దాంతో అప్పటివరకు ఎన్టీఆర్ తన అభిమానులను ఇలా పలు బ్రాండ్ లతో మాత్రమే పలకరించనున్నాడు .
ఈ వేసవిలో ఎన్‌టీఆర్ యాపీ ఫిజ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సంస్ద పేర్కొంది. కర్ణాటకలోని మైసూరులో తన అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని పార్లే ఆగ్రో ఇటీవలే పూర్తి చేసింది. హైదరాబాద్, చెన్నైల తర్వాత దక్షిణాదిన ఇది మూడో ఉత్పత్తి కేంద్రం ఇక్కడి ఉత్పత్తి సామర్థ్యాలకు అనుగుణంగా దక్షిణాదిన తన వ్యాపార విస్తరణకు సంస్థ ప్రణాళికలను రూపొందిస్తోంది.
ఇందులో భాగంగానే ఎన్‌టీఆర్‌ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నట్లు పార్లే ఆగ్రో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నాడియా చౌహాన్ పేర్కొన్నారు. పేరుపొందిన బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ తెలిపారు.