బాల‌య్య‌ను ప‌ట్టించుకునే నాధుడే లేడా?

న‌ట‌సింహ‌, టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ కు ఇండ‌స్ర్టీ నుంచి  ఎదురైన స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికేనా? ఆయ‌న‌కెదురైన భంగ‌పాటుకు క్ష‌మాప‌ణ‌లు ద‌క్కేనా?  తాజా ప‌రిస్థితుల్లో బాల‌య్య త‌రుపున‌ బాధ్య‌త తీసుకునేదెవ‌రు? ఇండ‌స్ర్టీలో ఆయ‌న సామాజిక వ‌ర్గం ఇప్పుడాయ‌న వెంట ఉండేనా? అన్న ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఉత్ప‌న్నం అవుతున్నాయి. కాసేపు బాల‌య్య భూములు పంచుకున్నారు అన్న వివాదాస్ప‌ద అంశం ప‌క్క‌న‌బెడితే! బాల‌య్య‌ను పిల‌వ‌కుండా ఇండస్ర్టీ స‌మ‌స్య‌ల‌పై రెండు సార్లు భేటీలు నిర్వ‌హించ‌డం అన్న‌ది నూటికి నూరుపాళ్లు స‌మంజ‌సం కాదని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

చిరంజీవి, నాగార్జుల స‌మ‌కాలిన హీరో అయిన బాల‌య్య‌ను పిల‌వ‌క‌పోవ‌డం ఆయ‌న‌కు క‌చ్చితంగా భంగ‌పాటు అనే మెజార్టీ వ‌ర్గం భావిస్తోంది. బాల‌య్య‌ వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉన్నా?  భేటీల నిర్వ‌హ‌ణ‌లో పాలు పంచుకుంటారా?  లేదా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే బాల‌య్య‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఓ  ఫోన్ కాల్ చేసి చెప్పేస్తే స‌రిపోయేది. కానీ ఇక్క‌డ ఆ ఛాన్స్ ఎవ్వ‌రూ తీసుకోలేదు. ఇప్పుడా త‌ప్పును ఒక‌రిపై ఒక‌రు నెట్టుకుంటున్నారు. బాల‌య్య‌ను పిల‌వాల్సిన బాధ్య‌త `మా` అసోసియేష‌న్ది అని నిర్మాత సి. క‌ళ్యాణ్ అంటున్నారు. దానికి `మా` అధ్య‌క్షుడు న‌రేష్  కూడా స్పందించారు. ఈ భేటీల గురించి మాకే తెలియ‌దు..మేము ఎలా పిలుస్తామ‌ని న‌రేష్ వాదిస్తున్నారు. అయితే ఇక్క‌డ సి. క‌ళ్యాణ్ రెండు నాల్క‌ల‌ ధోరిణిని ప్ర‌ద‌ర్శించారని తెలుస్తోంది.

ముందు ఇది నిర్మాతల మీటింగ్..బాల‌య్య నిర్మాత కాదు..ఆయ‌న సినిమాలు  చేయ‌లేదన్నారు. ప‌రిస్థితి ఆయ‌న పీక‌ల‌మీద‌కు వెళ్లే స‌రికి `మా` మీద‌కు నెట్టే ప్ర‌య‌త్నం చేసారు. ఇక ఈ రెండు భీటీల‌కు లీడ్ తీసుకున్న చిరంజీవి, నాగార్జున  సైలెంట్ గా ఉన్నారు. ఇక ఫిలించాంబ‌ర్ త‌రుపునుంచి అక్క‌డ కీల‌కంగా ఉండే ఓ వ్య‌క్తి హాజ‌ర‌య్యారు. అయితే ప్ర‌స‌న్న కుమార్ స‌హా లైమ్ లైట్ లో లేని కొంద‌రు చాంబ‌ర్ ప్ర‌తినిధులు త‌మ‌ని పిల‌వ‌లేద‌ని డిబేట్ల సాక్షిగా అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కారు. ఇక్క‌డ బాల‌య్య‌ను ఓ ఆయుధంలా వాడుకుని మెగా ఫ్యామిలీపై లేని పోని ఆరోప‌ణ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

వాస్త‌వానికి ప్ర‌స‌న్న కుమార్ లాంటి వాళ్లు ఛాంబ‌ర్ ని ప‌ట్టుకుని వేలాడ‌టం త‌ప్ప వాళ్లెవ్వ‌రూ ఇప్పుడు సినిమాలు చేయ‌లేదు. వాళ్లంతా ఇప్పుడు త‌మ వ్య‌క్తిగ‌త  క‌క్ష‌ల్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు.  ఇటు బాల‌య్య సామాజిక వ‌ర్గం కూడా ఈ విషయంపై అంత‌గా రియాక్ట్ అవ్వ‌డం లేదు. బెల్లం ఉన్న చోటే చీమ‌లన్నీ  చేరుతాయి అన్న నానుడిల ఇప్పుడా వ‌ర్గ‌మంతా  మెగా ఫ్యామిలీ వెంటే ప‌డుతున్నారు. ఇండ‌స్ర్టీలో వెనుకుండి  బాల‌య్య‌కు జై కొట్టేవారంతా కూడా ఇప్పుడు సైలెంట్ గానే ఉంటున్నారు. సాధార‌ణంగా  ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ వివాదాల్లో త‌ల దూర్చ‌డానికి  ఇష్ట‌ప‌డ‌రు. స‌మ‌స్య త‌న‌వ‌ర‌కూ వ‌చ్చినా త‌ప్పు అవ‌త‌లి వాడిదే అయినా?  మౌనంగా ఉంటారు త‌ప్ప‌! మాట్లాడే వ్య‌క్తిత్వాలు చాలా త‌క్కువ‌. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ బాల‌య్య‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పేదెవ‌రు? అస‌లు ప‌ట్టించుకునే నాధుడెవ‌రు.