యంగ్ హీరో నారా రోహిత్ మిస్సింగ్!! అంటూ ఇటీవల టాలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా రోహిత్ కెమెరా ముందుకు రాకపోవడంతో రకరకాల సందేహాలు ఫ్యాన్స్ లో వ్యక్తమయ్యాయి. అయితే అన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు అతడు రెడీ అవుతున్నాడని తాజా సన్నివేశం చెబుతోంది. ఈ రెండేళ్ల సైలెన్స్ వెనక చాలానే మీనింగ్ ఉంది. అంతకుమించిన ప్లానింగ్ ఉంది. హార్డ్ వర్క్ ఉంది. గడిచిన కాలంలో అతడు లుక్ పరంగా మేకోవర్ కోసం ఎంతగా శ్రమించాడో తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది.
రోహిత్ కొత్త లుక్ చూడగానే షాక్ తినాల్సిందే ఎవరైనా. అంతగా ఛేంజోవర్ చూపించాడు. ఇంతకుముందులా బొద్దుగా కనిపించలేదు. భారీ కాయాన్ని పూర్తిగా ట్రిమ్ చేసేశాడు. ఆ ముఖం షేప్ కూడా చాలా మారింది. అప్పుడే ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్లొచ్చిన వాడిలా పూర్తిగా మారిపోయాడు. ఇక గుబురు మీసం అంతే స్టన్నింగ్ ఇంప్రెషన్ కలిగిస్తోంది. ఇంతకీ ఈ కొత్త లుక్ దేనికోసం? అంటే.. రోహిత్ తదుపరి చిత్రం కోసమేనట. రౌడీ ఫెలో తర్వాత సరైన హిట్ అన్నదే లేని రోహిత్ ఈసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.
కొంత గ్యాప్ తర్వాత తదుపరి సినిమాని పట్టాలెక్కించేందుకు రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ సహా ప్రీప్రొడక్షన్ పూర్తయింది. కరోనా లాక్ డౌన్ వల్ల టీమ్ వెయిట్ చేస్తోంది. ఈ లాక్ డౌన్ ఎత్తేయగానే సినిమా సెట్స్ కెళ్లిపోనుంది. ఈ మూవీతో ఎలాగైనా తిరిగి రేస్ లోకి దూసుకురావాలన్నది నారా రోహిత్ పంతం. మరి ఈసారి పోరులో తాను అనుకున్నది సాధిస్తాడా? సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక తదుపరి సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.