తెలుగు సినిమాలతో పాటు ఇరుగు పొరుగు భాషల సినిమాల్ని తెరకెక్కించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్న లొకేషన్ ఏది? అంటే విశాఖ, అరకు లొకషన్స్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత ఇచ్చిన సమాచారం ప్రకారం.. దాదాపు మన సినిమాలు 80శాతం వైజాగ్ నుంచి అరకు పరిసరాల్లో చిత్రీకరించేందుకే నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇక గోదావరి పరిసరాలతో పాటు రాజమండ్రిలో కొన్ని లొకేషన్లను విరివిగా మన సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అటువైపు ఒడియా సినిమాలకు వైజాగ్, అరకు లొకేషన్లనే ఎక్కువ ఉపయోగిస్తారని తెలిపారు.
ఆసక్తికరంగా నిన్నటి సాయంత్రం వైజాగ్ లో జరిగిన గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ విశాఖ నగరంలో ఉన్న లొకేషన్ల ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ మాట్లాడడం ఆసక్తిని కలిగించింది. మన నిర్మాతలు విదేశాలకు వెళ్లిపోతుంటారు కానీ.. వైజాగ్ లో ఉన్నన్ని మంచి లొకేషన్లు ఇంకెక్కడా ఉండవు అంటూ పొగిడేశారు. బీచ్ సొగసుల విశాఖ నగరానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆంగ్లేయుల కాలం నుంచి డచ్ పర్యాటకుల కాలం నుంచి ప్రతిదానికి ఆనవాళ్లు ఈ చారిత్రక నగరంలో ఉన్నాయి. విశాఖ కైలాస్ గిరి నుంచి ఆర్కే బీచ్ పరిసరాల నుంచి అటు భీమిలి వరకూ అద్భుతమైన బీచ్ లొకేషన్లు ఉన్నాయి. అక్కడి నుంచి రెండు గంటల దూరంలోనే అరకు అందుబాటులో ఉండడంతో మన నిర్మాతలంతా అటువైపే ఆసక్తిని చూపిస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన విరామ జీవితాన్ని వైజాగ్ లోనే గడిపేందుకు నిర్ణయించుకోవడాన్ని బట్టి వైజాగ్ ఎంత ప్రశాంత నగరమో చెప్పొచ్చు.