కొత్తగా ట్రై చేస్తున్న చైతన్య.. ట్రయల్ ఫలిస్తుందా?
తెలుగు సినిమాల్లో నైజాం యాసను కించపరిచారని విమర్శించిన సందర్భాలున్నాయి. ఇదివరకూ విలన్ గ్యాంగ్ సభ్యులు.. కమెడియన్లు నైజాం యాసను కామెడీ కోసం ఉపయోగించుకున్న సందర్భాలున్నాయి. దీనిపై తెలంగాణవాదులు తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలెన్నో.. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ యాసను తేడా పాత్రలకు ఆపాదించిన తెలుగు సినిమా దర్శకులపైనా విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా భాస-యాస మారుతోంది. యాసకు గౌరవం అంతకంతకు పెరుగుతోంది. యాస ఇప్పుడు హీరోగా మారుతోంది.
ముఖ్యంగా తెలంగాణ యాస ఇటీవల హీరో అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ నైజాం యాసతో అదరగొట్టాడు. తొలుత ఈ చిత్రంలో ఊర మాస్ నైజాం యాక్సెంట్ వినియోగించినందుకు పూరిపై విమర్శలు వచ్చినా.. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం .. యూత్ ని థియేటర్ల వైపు రప్పించడంపై ఆసక్తికర చర్చ సాగింది. ఇక శేఖర్ కమ్ముల సినిమాల్లో నైజాం యాస పెద్ద సక్సెసైంది. అప్పట్లో ఫిదా చిత్రంలో సాయి పల్లవి నైజాం యాసకు చక్కని గుర్తింపు దక్కింది. కింగ్ చిత్రంలో త్రిష నైజాం యాస ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
<
p style=”text-align: justify”>ఈసారి అదే నైజాం యాసను కమ్ముల హీరో పాత్రకు ఆపాదించడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి ఈ చిత్రంలో కథానాయిక. నారాయణదాస్ నారంగ్- పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తొలిసారి చైతూ కొత్తగా నైజాం యాసను ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం యాక్సెంట్ బెటర్ మెంట్ కోసం చైతన్య ట్రైనింగ్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సాయి పల్లవి ఇదివరకూ ఫిదాలో నైజాం యాస మాట్లాడింది.. ఈ సినిమాలోనూ మరోసారి నైజాం యాసతో ఆకట్టుకుంటుందట. చైతన్య- సాయి పల్లవి మధ్య ప్రేమకథ.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది. మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగచైతన్య వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి కమ్ముల సినిమా సెట్స్ లో జాయిన్ అవుతున్నారని తెలుస్తోంది.