ఎన్టీఆర్ బయోపిక్: సీన్ లోకి నాదెండ్ల .. నోటీసులు, వార్నింగ్

ఊహించని విధంగా సీన్ లోకి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు వచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో తనను నెగిటివ్‌గా చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నాదెండ్ల హెచ్చరించారు. ఈ రోజు (శుక్రవారం) నాడు నాదెండ్లభాస్కర్ రావు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ… ఎన్టీఆర్ బయోపిక్ సినిమా యూనిట్ కు ఇప్పటికే రెండు దఫాలుగా నోటీసులు జారీచేసినట్టు చెప్పారు.

‘ఎన్టీఆర్’ బయోపిక్ లో తన గురించి తప్పుగా – నెగటివ్ గా చూపించే ప్రయత్నం జరగొచ్చని.. అలా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని అన్నారు. అయినా సరే తన నోటీసులు లెక్క చేయకుండా ఒకవేళ ఈ సినిమాలో తనను నెగటివ్ గా చూపిస్తే తర్వాత జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీఆర్ జీవితం పేరుతో తనపై దుష్ప్రచారానికి దిగితే మాత్రం చర్యలు తప్పవన్నారు.

అలాగే ఈ సినిమా నిర్మిస్తున్న నటుడు బాలకృష్ణ,దర్శకుడు క్రిష్ కు కూడ నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు. సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. అయితే ఇలా నాదెండ్ల పదేపదే ఈ విషయమై మాట్లాడుతుండడంతో… కచ్చితంగా ఇందులో ఆయన్ను బయోపిక్ లో నెగటివ్ చూపించినట్లు సమాచారం ఉండొచ్చని మీడియా భావిస్తోంది.